Andhra Pradesh State Current affairs In Telugu August 2022: Andhra Pradesh state current affairs plays crucial role in GROUP-1, GROUP-2, Panchayat Secretary, GROUP-4 , Assistant Engineer(AE), Sub-Inspector and Constable, Junior Lecturers etc., exams.. Andhra Pradesh Government releases notification for Various posts through Andhra Pradesh like GROUP-1, GROUP-2, Panchayat Secretary, GROUP-4 , Assistant Engineer(AE), Sub-Inspector and Constable, Junior Lecturers, Degree Lecturers and various executive and non-executive posts under various departments of Telangana. Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. To complement your preparation, we are providing you the Andhra Pradesh State Current affairs In Telugu August 2022.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ ఆగస్టు 2022 తెలుగులో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ GROUP-1, GROUP-2, పంచాయితీ సెక్రటరీ, GROUP-4, అసిస్టెంట్ ఇంజనీర్(AE), సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్స్ మొదలైన పరీక్షలలో కీలక పాత్ర పోషిస్తుంది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. APPSC ద్వారా GROUP-1, GROUP-2, పంచాయితీ సెక్రటరీ, GROUP-4, అసిస్టెంట్ ఇంజనీర్ (AE), సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు మరియు వివిధ ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు తెలంగాణలోని వివిధ విభాగాల క్రింద. కరెంట్ అఫైర్స్ పోటీ పరీక్షల్లో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కాబట్టి, ప్రభుత్వ పరీక్షలకు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు అభ్యర్థులు దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ప్రిపరేషన్‌ను పూర్తి చేయడానికి, మేము మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్‌ను ఆగస్టు 2022 తెలుగులో అందిస్తున్నాము.
APPSC/TSPSC Sure shot Selection Group
Andhra Pradesh State Current affairs In Telugu | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ తెలుగులో
1. మిస్ సౌత్ ఇండియాగా వైజాగ్ అమ్మాయి చరిష్మా కృష్ణ
మిస్ సౌత్ ఇండియాగా విశాఖ అమ్మాయి, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ విభాగం విద్యార్థిని చరిష్మా కృష్ణ ఎంపికైంది. కేరళలో పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన ఈ పోటీల్లో ఆమె కిరీటం దక్కించుకుంది. ఈ పోటీల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన యువతులు పాల్గొన్నారు. వీరందరినీ వెనక్కి నెట్టి, తన ప్రతిభతో చరిష్మా విజేతగా నిలిచింది.
ప్రముఖ మోడల్ భారతి బెర్రి ఆమెకు శిక్షణ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫెమీనా మిస్ ఇండియాకు సిద్ధమవుతోంది. చిన్నతనం అమెరికాలో గడిపిన చరిష్మా కృష్ణ భరతనాట్యం, కూచిపూడి నృత్యం తొమ్మిదేళ్లుగా నేర్చుకుంటోంది. స్విమ్మింగ్, కరాటే, గుర్రపుస్వారీ విద్యలను సైతం నేర్చుకుంది. చిన్నతనం నుంచి కళలపై ఆసక్తితో నృత్య కళాకారిణిగా, నటిగా రాణిస్తోంది. తండ్రి హరికృష్ణ ప్రభుత్వ ఉద్యోగి కాగా తల్లి గృహిణి.
2. ఆంధ్రప్రదేశ్‌లో 12 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు
అత్యాచారం కేసులు, చిన్నారులపై జరిగే లైంగిక అత్యాచారం (పోక్సో) కేసులను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లో 12 ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ అత్యాచారం, పోక్సో కేసుల పరిష్కారం కోసం దేశంలో 1,023 ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలని 2019 అక్టోబర్‌లో నిర్ణయించినట్లు తెలిపారు.
ప్రస్తుతం దేశంలో 728 ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టులు పని చేస్తున్నట్లు చెప్పారు. ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టుల కాలపరిమితిని ఒక ఏడాదికి పరిమితం చేయాలని ముందుగా నిర్దేశించినా తదుపరి 2023 మార్చి 31 వరకు వీటిని కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఏడాది జూన్ నాటికి దేశంలోని అన్ని ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టుల్లో కలిపి లక్షకుపైగా కేసులను పరిష్కరించినట్లు తెలిపారు.
3. AP: హైకోర్టు నూతన జడ్జిలుగా ఏడుగురు ప్రమాణస్వీకారం
ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన ఏడుగురు న్యాయాధికారులు ప్రమాణం చేశారు. ఏవీ రవీంద్రబాబు, డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ సాగర్, బండారు శ్యాం సుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వెంకట లక్ష్మీ నరసింహ చక్రవర్తి, తాళ్లప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణలతో గవర్నర్ హరిచందన్ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణం చేయించారు. వాస్తవానికి ప్రమాణ స్వీకారం చేయించే విషయంలో గవర్నర్ తన అధికారాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బదలాయిస్తారు. దీంతో కొత్త న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి (సీజే) ప్రమాణం చేయించడం ఆనవాయితీ. సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు మాతృవియోగం కలగడంతో ఆయన వచ్చే పరిస్థితి లేదు. దీంతో గవర్నర్ కొత్త న్యాయమూర్తులతో ప్రమాణం చేయించారు.
4. ఓఎన్జీసీకి ఎన్జీటీ భారీ జరిమానా
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ లిమిటెడ్(ఓఎన్జీసీ)కి భారీ జరిమానా విధించింది జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ). కోనసీమ జిల్లాలో జల, భూ కాలుష్యానికి కారణమైనందున రూ.22.76 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. ఓఎన్జీసీపై చర్యలకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించింది. సీఎస్ఆర్ ఫండ్స్‌ను ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. సంయుక్త కమిటీ నివేదిక ఆధారంగా ఓఎన్జీసీకి భారీ జరిమానా విధించినట్లు తెలిపింది. యెనుమల వెంకటపతి రాజు పిటిషన్పై విచారణ చేపట్టిన హరిత ట్రైబ్యునల్- (ఎన్జీటీ) తీర్పు వెలువరించింది. పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై ఈ జరిమానా విధించింది.
5. అగ్రి ఇన్ఫ్రా ఫండ్ వినియోగంలో ఏపీ నంబర్ 1
వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధుల (అగ్రి ఇన్ఫ్రా ఫండ్) వినియోగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. వ్యవసాయ క్షేత్రం (ఫామ్ గేట్) వద్ద మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తూ ఉత్తమ రాష్ట్రంగా ఆవిర్భవించింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో అగ్రి ఫండ్స్ వినియోగంలో దేశంలోనే ఉత్తమ రాష్ట్రం అవార్డును కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ న్యూ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రైతుబజార్ల సీఈవో బి.శ్రీనివాసరావుకు అందజేశారు. అగ్రి ఇన్ఫ్రా ఫండ్స్ వినియోగంలో అనేక రాష్ట్రాలు చాలా వెనుకబడి ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ నిధులను వినియోగించుకొని గ్రామస్థాయిలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అగ్ర స్థానంలో నిలిచిందని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రశంసించారు.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ క్షేత్రం వద్ద బహుళ ప్రాయోజిత కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. పీఎసీఎస్ ద్వారా ఆర్బీకే స్థాయిలో 4,277 గోదాములు – డ్రయింగ్ ప్లాట్‌ఫారాలు, ఏపీ సీవిల్ సప్లైస్ కార్పొరేషన్ కోసం 60 బఫర్ గోడౌన్లు, ప్రైమరీ ప్రాసెసింగ్ కోసం 830 క్లీనర్స్, 4,277 డ్రయింగ్ ప్లాట్‌ఫారాలు, 2,977 డ్రయర్లు, 101 పసుపు పాలిషర్స్ ఏర్పాటు చేసింది. ఉద్యాన ఉత్పత్తుల కోసం 945 కలెక్షన్ సెంటర్లు, 344 కూల్డ్ రూమ్స్, ఆర్బీకేలకు అనుబంధంగా 10,678 ఎస్సైయింగ్ పరికరాలు, 10,678 ప్రొక్యూర్మెంట్ కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. ఇలా 39,403 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2,706 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలి విడతగా 1,305 పీఏసీఎస్‌ల పరిధిలో 10,677 మౌలిక సదుపాయాల కల్పనకు అగ్రి ఇన్ఫ్రా ఫండ్ కింద రూ.1,584.6 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులు చురుగ్గా జరుగుతున్నాయి.
6. ఇంగ్లిష్ జల సంధిని ఈదిన హెడ్ కానిస్టేబుల్ తులసీచైతన్య
స్విమ్మింగ్ మౌంట్ ఎవరెస్ట్‌గా ప్రసిద్ధికెక్కిక ప్రఖ్యాత ఇంగ్లిష్ జలసంధిని అంతర్జాతీయ స్విమ్మర్ తులసీచైతన్య సునాయాసంగా ఈదాడు. ఇంగ్లండ్లోని డోవర్ తీరం నుంచి ఫ్రాన్స్లోని కలైస్ తీరం వరకూ ఈ జలసంధి ఉంది. అక్కడి ఆర్గనైజర్లకు రూ.4 లక్షలు చెల్లించి ఆయా దేశాల అనుమతులు తీసుకుని ఈ నెల 27న 33.79 కిలోమీటర్ల పొడవున్న జలసంధిని 15 గంటల 18 నిమిషాల్లో ఈదాడు.
స్విమ్మర్ తులసీచైతన్య విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. గతంలో పాక్ జలసంధి(భారత్–శ్రీలంక), జీబ్రా జలసంధి(తరిఫా–మెహారో), బోడెన్సీ జలసంధి(జర్మనీ–స్విట్జర్లాండ్)లను ఈదిన రికార్డులున్నాయి. ఇంగ్లండ్ తీరంలో ఉన్న మరో రెండు జల సంధులను ఈదేందుకు తులసీచైతన్య సిద్ధమవుతున్నాడు. మైనస్ డిగ్రీల చలి, షార్క్లు, జెల్లీ ఫిష్లు కలిగిన ఇంగ్లిష్ జలసంధిని సాహసోపేతంగా ఈదిన తులసీచైతన్యను కృష్ణా జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి రమేష్ అభినందించారు.
7. APలో ఆరోగ్యశ్రీ ఖైదీలకూ వర్తింపు
ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఉచిత వైద్యం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మానవతా దృక్పథంతో ఖైదీలకు సైతం చికిత్స అందించనుంది.
ఈ మేరకు ఖైదీలకు కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తూ తాజాగా జీవో విడుదల చేసింది. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా తొలిసారి ఖైదీలకూ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలందించనుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాదు ప్రైవేటు/కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ వీరికి వైద్యం అందించనుంది. 2019 డిసెంబర్‌లో జరిగిన ప్రిజన్ డెవలప్‌మెంట్ బోర్డు సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఖైదీల వైద్య సదుపాయాలపై నివేదిక సమర్పించాలని జైళ్ల శాఖను ఆదేశించారు. దీంతో స్వతహాగా వైద్యుడైన జైళ్ల శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాసరావుతో పాటు అప్పటి గుంటూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ కె.రఘు, డీజీ అషాన్‌రెజా ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆ నివేదికను ఆమోదిస్తూ ప్రభుత్వం 2022 జూలై 22న జీవో విడుదల చేసింది. దీంతో ఇకపై రాష్ట్రంలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు అనారోగ్యం పాలైతే వారు సాధారణ ప్రజల మాదిరిగానే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు పొందొచ్చు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంబంధిత జబ్బుకు చికిత్స లభించకపోతే ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తారు. వీరి కోసం ఇప్పటికే ఆరోగ్యశ్రీ సీఈవో నెట్‌వర్క్ ఆస్పత్రులను గుర్తించారు. ఖైదీలు వైద్య సేవలు పొందడానికి ఆధార్/రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. అవి లేని ఇతర రాష్ట్రాల ఖైదీలకు చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ (సీఎంసీవో) కార్డును తాత్కాలికంగా జారీ చేస్తారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జైళ్లలో శిక్ష అనుభవిస్తూ సరైన వైద్యం అందక మరణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గనుంది.
8. వైజాగ్ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం
విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. భవన నిర్మాణానికి స్థల సేకరణ కూడా పూర్తయ్యిందని, జోన్ ఏర్పాటుకు నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయని అన్నారాయన. రాజ్యసభలో కేంద్రీయ విశ్వ విద్యాలయాల చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ప్రశ్నించారు. దీనికి రైల్వే మంత్రి బదులిస్తూ.. రైల్వో జోన్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌ను ఆమోదించినట్లు వెల్లడించారు.
అంతకు ముందు బిల్లుపై శ్రీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ రైల్వేకు సంబంధించి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై రైల్వే మంత్రికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా విశాఖ కేంద్రంగా ప్రకటించిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటును వేగవంతం చేయాలని కోరారు. రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద మూడు సంవత్సరాలుగా డీపీఆర్ పెండింగ్‌లోనే ఉందని గుర్తు చేశారు.
9. ఫ్యామిలీ డాక్టర్ పథకం నెలలో 26 రోజులు గ్రామాల్లోనే వైద్య సేవలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతున్న ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానం అమలుకు వైద్య, ఆరోగ్య శాఖ ఎస్‌ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) రూపొందించింది. క్షేత్ర స్థాయిలో పనిచేసే ఆశా వర్కర్, ఏఎన్‌ఎం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్), పీహెచ్‌సీ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) వైద్యుడు.. ఇలా వీరందరి విధులు, బాధ్యతలను ఎస్‌ఓపీలో పొందుపరిచారు. ఎస్‌ఓపీపై జిల్లాల్లో అధికారులు, వైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. గ్రామీణ ప్రజలకు ఉత్తమ వైద్యం, ఆరోగ్య సంరక్షణ కోసం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఈ విధానం అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిశ్చయించారు. ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది.
రోజంతా గ్రామంలోనే..
రాష్ట్ర వ్యాప్తంగా 1142 పీహెచ్‌సీలు ఉన్నాయి. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా వైద్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలులో భాగంగా ఇద్దరు పీహెచ్‌సీ వైద్యులకు తమ పరిధిలోని సచివాలయాలు/విలేజ్ క్లినిక్‌లను విభజిస్తున్నారు. ఏ రోజు ఏ సచివాలయం/విలేజ్ క్లినిక్ పరిధిలో వైద్య సేవలు అందించాలన్న దానిపై టైమ్ టేబుల్ వేస్తున్నారు. దాని ఆధారంగా ఒక్కో వైద్యుడు రోజు మార్చి రోజు గ్రామాలు సందర్శించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పీహెచ్‌సీ వైద్యుల సేవలు నెలలో 26 రోజుల పాటు గ్రామాల్లోనే అందుతాయి. గ్రామాలకు వెళ్లే వైద్యుడు 104 మొబైల్ మెడికల్ యూనిట్‌తో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ గ్రామంలోనే ఉంటాడు. అతనితో పాటు ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌లతో కూడిన బృందం గ్రామీణ ప్రజలకు సేవలు అందిస్తుంది. ప్రారంభంలో ప్రతి గ్రామానికి నెలలో ఒక సారి సందర్శన ఉంటుంది. తర్వాత నెలలో రెండు సార్లు 104 ఎంఎంయూ సందర్శించేలా సేవలు విస్తరిస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న 656 వాహనాలకు అదనంగా 432 వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది.
10. Talaq రాతపూర్వకంగా కూడా చెల్లదు
ఏక వాక్యంలో మూడుసార్లు చెప్పే తలాక్‌కు ఎలాంటి గుర్తింపు లేదంది. మూడుసార్లు తలాక్ చెప్పి, దాన్ని రాతపూర్వకంగా పంపడం చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. ఒకవేళ ఇస్లాం చట్ట నిబంధనల ప్రకారం విడాకులు తీసుకోవాలంటే.. భార్య, భర్త ఇద్దరి తరపు మధ్యవర్తులు వారి మధ్య సయోధ్యకు ప్రయత్నించాలంది. అది సాధ్యం కానప్పుడే సహేతుక కారణాలతో తలాక్ చెప్పొచ్చునని, అలా చెప్పే తలాక్‌ల మధ్య తగిన వ్యవధి ఉండి తీరాలని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారీ ఇటీవల తీర్పు వెలువరించారు.
11. నల్లమలలో 73 పెద్ద పులులు
దేశంలోనే అతిపెద్ద అభయారణ్యమైన నల్లమల టైగర్ రిజర్వు ఫారెస్టులో 73 పెద్దపులులు ఉన్నట్లు పులుల గణనలో తేలింది. 2020లో 63 ఉండగా రెండేళ్లలో పెద్దపులుల సంఖ్య మరో పది పెరిగింది. ఇక్కడ 2018లో 47 పులులే ఉన్నాయి. పులుల గణన ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు కొనసాగింది.
రాష్ట్రవ్యాప్తంగా వీటిసంఖ్య 75 ఉన్నట్లు అటవీ అధికారులు తెలిపారు. అదనంగా చేరిన రెండు పులులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి పాపికొండల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు. నాలుగేళ్లలో పులుల పెరుగుదల 60 శాతం ఉండటం గొప్ప విషయమని అటవీ అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ ఫారెస్టు నుంచి కూడా పులుల సంచారం జరుగుతోంది.
12. జాంధానీ చీరకు జాతీయ పురస్కారం
ఉప్పాడ జాంధానీ చేనేత చీరలను జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసి విశేష ప్రతిభ కనబరిచిన కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం వాకతిప్పకు చెందిన వెంకట రామలక్ష్మి ఫ్యాబ్రిక్స్ సంస్థకు జాతీయ పురస్కారం లభించింది. సంస్థ అధినేత లొల్ల సత్యనారాయణ దిల్లీలో కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో పురస్కారం అందుకున్నారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. కరోనా వ్యాప్తి కారణంగా పురస్కార ప్రదానం జరగలేదు.
13. ఇథనాల్ హబ్‌గా ఏపీ
ఇథనాల్ తయారీ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతోంది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడంతో చెరకు నుంచే కాకుండా బియ్యం నూక, మొక్కజొన్నలు లాంటి ఆహార ధాన్యాల నుంచి ఏపీలో ఇథనాల్ తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. భగ్గుమంటున్న ఇంధన ధరల నేపథ్యంలో 2025–26 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపి విక్రయించాలన్న లక్ష్యంతో ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్ తయారీకి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.
ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకోవడంతో ఏపీలో ఇథనాల్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు క్రిబ్‌కో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అస్సాగో, ఈఐడీ ప్యారీ, డాల్వకోట్, ఎకో స్టీల్ లాంటి పలు కంపెనీలు ఇప్పటికే ప్రకటించగా మరికొన్ని కంపెనీలు చర్చలు జరుపుతున్నాయి. దీనివల్ల సుమారు రూ.1,917 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి రానున్నాయి.
14. పర్యావరణహిత ‘పవర్’
పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తి దిశగా రాష్ట్రంలో వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన మొట్టమొదటి ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్(ఎఫ్‌జీడీ) ప్రాజెక్టు వచ్చే ఏడాది మార్చి నాటికల్లా విశాఖ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ)లో అందుబాటులోకి రానుంది. వ్యవసాయానికి పూర్తిగా సౌర విద్యుత్‌నే వినియోగించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్లాంటు స్థాపించేందుకు చర్యలు చేపట్టింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీలో కాలుష్యాన్ని తగ్గించే విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పడానికి ఉత్సాహం చూపిస్తోంది. ఇందులో భాగంగానే విశాఖ ఎన్టీపీసీలో పర్యావరణ అనుకూల ఎఫ్‌జీడీ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. బొగ్గును కాల్చే ప్రక్రియలో విడుదలయ్యే హానికర వాయువుల తీవ్రతను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. దాదాపు 90 శాతం నిర్మాణం పూర్తయ్యిందని, వచ్చే ఏడాది మార్చి కల్లా అందుబాటులోకి తీసుకువస్తామని ఎన్టీపీసీ అధికారులు తెలిపారు. మొత్తం రూ.871 కోట్ల వ్యయంతో 2 వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ఎఫ్‌జీడీ దక్షిణ భారతదేశంలోనే తొలి ప్రాజెక్టు కావడం విశేషం.
15. మిస్ ఇండియా యూఎస్–2022 రన్నరప్‌గా సంజన
అమెరికా న్యూజెర్సీలో జరిగిన మిస్ ఇండియా యూఎస్–2022 పోటీల్లో పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రుకు చెందిన చేకూరి సంజన రెండో రన్నరప్‌గా నిలిచింది. బుధవారం రాత్రి విజేతలను ప్రకటించగా, ఆ వివరాలను పెనుగొండ మండల సర్పంచ్‌ల చాంబర్ అధ్యక్షురాలు దండు పద్మావతి మీడియాకు వెల్లడించారు. తన సోదరుడు చేకూరి రంగరాజు, మధు దంపతుల కుమార్తె అయిన సంజన ఎంఎస్ చదువుతూ పోటీల్లో పాల్గొందని, గత 20 ఏళ్లుగా వారు అమెరికాలో ఉంటున్నట్టు తెలిపారు.
16. ఏపీ సీఎం వైఎస్ జగన్ 8 కంపెనీలకు శంకుస్థాపన
గతంలో ఎన్నడూ ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూడని పారిశ్రామికవేత్తలు తాను సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.
పరిశ్రమలకు తమ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహాన్ని గుర్తించే గత మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీకి మొదటి స్థానం లభిస్తోందన్నారు. పరిశ్రమలకు ఎలాంటి సహాయం, సహకారం కావాలన్నా తమ ప్రభుత్వం ఒక్క ఫోన్ కాల్‌తో అందుబాటులో ఉంటుందని చెప్పారు. గత ప్రభుత్వాలు బకాయిపడ్డ వివిధ ప్రోత్సాహకాలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక చెల్లించిందని గుర్తు చేశారు. వచ్చే నెలలో విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ఆగస్టు 16వ తేదీన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో జపాన్‌కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ యెకహోమా నెలకొల్పిన అలయన్స్ టైర్స్ కంపెనీ (ఏటీసీ) మొదటి దశ ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించి టైర్‌పై సంతకం చేసిన అనంతరం రెండో దశ ప్లాంట్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. మరో 8 పరిశ్రమలకు కూడా సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది.
17. Flipkart గ్రోసరీ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ ప్రారంభం
ఈ – కామర్స్ మార్కెట్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి గ్రోసరీ ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాన్ని విజయవాడలో ఏర్పాటు చేసింది. విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద ఏర్పాటు చేసిన ఈ నూతన ఫెసిలిటీని ఆగష్టు 22న ప్రారంభించింది. ఈ కేంద్రం ప్రారంభంతో ఫ్లిప్‌కార్ట్ సరఫరా చైన్ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించింది. ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,000 మందికి ఉపాధి కలగడంతో పాటు వేలాది మంది స్థానిక విక్రేతలు, ఎంఎస్‌ఎంఈలు, చిన్న రైతులకు మార్కెట్ అవకాశాలు లభిస్తాయి. ఈ ఫెసిలిటీతో రాబోయే ప్రతిస్టాత్మక ఫ్లిప్‌కార్ట్ కార్యక్రమం బిగ్ బిలియన్ డేస్ 2022లో రోజుకు 4 వేల గ్రోసరీ ఆర్డర్లును నిర్వహించగలదు.
18. ఉన్నత విద్యా రంగంపై గోవా ప్రతినిధుల అధ్యయనం
ఉన్నత విద్యా రంగంలో రాష్ట్రం అమలు చేస్తున్న విధానాలను గోవా ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం అధ్యయనం చేసింది. జాతీయ విద్యా విధానం-2020 అమలులో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు, పునర్నిర్మాణం, సాధారణ ప్రవేశ పరీక్షల నిర్వహణ, డిగ్రీలో ఇంటర్న్‌షిప్ తదితర అంశాలను పరిశీలించింది. ఎన్‌ఏఏసీ, ఎన్‌ఐఆర్‌ఎఫ్, ఎన్‌బీఏ ర్యాంకులు సాధించేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందో కూడా బృందం తెలుసుకుంది. గోవా ప్రతినిధుల బృందంలో ఆచార్య నియాన్ మార్కోన్, ఎఫ్‌ఎం నదాఫ్, వందనా నాయక్, సందేశ్ గాంకర్, సిద్ధి బండాంకర్ తదితరులు పాల్గొన్నారు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |