Telugu govt jobs   »   Current Affairs   »   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెలవారీ కరెంట్ అఫైర్స్ తెలుగులో
Top Performing

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆగస్టు 2023 నెల కరెంట్ అఫైర్స్ తెలుగులో, APPSC గ్రూప్స్ మరియు అన్ని పోటీ పరీక్షల ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ ఆగస్టు 2023 తెలుగులో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ APPSC గ్రూప్స్, పంచాయితీ సెక్రటరీ, సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్స్ మొదలైన పరీక్షలలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలోAPPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2, గ్రామ సచివాలయం, ఉపాద్యాయులు మరియు ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయబడుతుంది. ప్రతి పోటి పరీక్షలలో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎక్కువగా ఆ రాష్ట్రము లో జరిగే అంశాలనుండి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి, ప్రభుత్వ పరీక్షలకు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు అభ్యర్థులు దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ప్రిపరేషన్‌ను పూర్తి చేయడానికి, మేము మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్‌ను ఆగస్టు 2023 తెలుగులో అందిస్తున్నాము.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆగస్టు 2023 నెల కరెంట్ అఫైర్స్ తెలుగులో_3.1

APPSC/TSPSC Sure shot Selection Group

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ తెలుగులో

1. ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించడంలో ఆంధ్రప్రదేశ్  అగ్రస్థానంలో ఉంది

ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది

ఏప్రిల్ 2022 నుండి మార్చి 2023 వరకు ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ కుటుంబాలకు గణనీయమైన సహాయాన్ని అందిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా దేశంలోని 24 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో 53,85,270 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించారు ఇందులో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 96.39% అంటే 51,91,091 ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి. ముఖ్యంగా, మరే ఇతర రాష్ట్రం కనీసం లక్ష ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించలేకపోయింది.

2. ఏపీలోని గుంటూరు సర్వజనాసుపత్రి డిజిటలైజేషన్‌లో దేశంలోనే రెండో స్థానం సాధించింది

ఏపీలోని గుంటూరు సర్వజనాసుపత్రి డిజిటలైజేషన్_లో దేశంలోనే రెండో స్థానం సాధించింది. (1)

ప్రభుత్వాసుపత్రులకు వచ్చిన రోగుల వివరాలను డిజిటలైజ్ చేయడంలో గుంటూరు సర్వజనాసుపత్రి దేశ వ్యాప్తంగా రెండో ర్యాంక్ సాధించింది. జూలై 29 న సాయంత్రం, ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా, 1,053 మంది రోగుల వివరాలను డిజిటలైజ్ చేయడం ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగరాజ్ లోని స్వరూప్ రాణి నెహ్రూ ఆసుపత్రి మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గుంటూరు జీజీహెచ్ 1,038 మంది పేర్లు నమోదు చేసి రెండో స్థానం, విజయవాడ ఆసుపత్రిలో 533 మంది వివరాలు నమోదు చేసినందున 7వ స్థానంలో నిలిచాయి.

3.ఆంధ్రప్రదేశ్‌లో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 11 రైల్వే స్టేషన్లు ఎంపికయ్యాయి

ఆంధ్రప్రదేశ్_లో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 11 రైల్వే స్టేషన్లు ఎంపికయ్యాయి (1)

అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. తొలిదశలో విజయవాడ డివిజన్‌లోని అనకాపల్లి, భీమవరం టౌన్, కాకినాడ టౌన్, తుని, ఏలూరు, నరసాపురం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, తెనాలి, ఒంగోలు, సింగరాయకొండ తో సహా 11 స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశారు.

రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లను ఆధునీకరించడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రం ఈ ఏడాది ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా 1,275 స్టేషన్లను అభివృద్ధి కోసం ఎంపిక చేయగా, అందులో 72 రైల్వే స్టేషన్లను ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపిక చేశారు.

4. మహిళలకు YSR చేయూత పధకం

మహిళలకు YSR చేయూత పధకం

వైఎస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా ఇప్పటికే 13 లక్షల మంది మహిళలకు శాశ్వత జీవనోపాధి కల్పించామని, వారి కుటుంబాలకు నెలవారీ స్థిరమైన ఆదాయం వచ్చేలా చూస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఇవ్వనుండగా ఇప్పటివరకు మూడు విడతల్లో లబ్ధిదారులకు రూ.14,129.11 కోట్లు అందచేసినట్లు చెప్పారు

పొదుపు సంఘాల మహిళలు ఉమ్మడిగా నెలకొల్పిన మహిళా మార్టులు సమర్థంగా పని చేస్తున్నాయని, ఇప్పటివరకు 36 మహిళా మార్టుల ద్వారా రూ.32.44 కోట్ల మేర వ్యాపారం జరిగినట్లు అధికారులు సీఎం జగన్ దృష్టికి తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో మహిళా మార్టులో సగటున రోజుకు రూ. 20.62 లక్షల వ్యాపారం జరిగిందని వివరించారు.

5. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూలమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది

గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కి అనుకూలమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది

గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూలమైన రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. స్వచ్ఛ ఇంధనం ఉత్పత్తికి అవసరమైన అన్ని వనరులు ఉండటం, ఇందుకోసం రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పాలసీని తేవడంతో కీలకమైన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు రాష్ట్రానికి రానున్నాయి. వీటి ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ మరియు అమ్మోనియా ఉత్పత్తిని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకటనకు ఒకరోజు ముందు ఈ విధానాన్ని ప్రకటించారు. ప్రస్తుతం, రాష్ట్ర గ్రీన్ హైడ్రోజన్ డిమాండ్ సంవత్సరానికి సుమారుగా 0.34 మిలియన్ టన్నులుగా ఉంది.

6. డిజిటల్ హెల్త్ ఖాతాల సృష్టిలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది

డిజిటల్ హెల్త్ ఖాతాల సృష్టిలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది

డిజిటల్ హెల్త్ అకౌంట్ల సృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంట్లోనే వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 43.01 కోట్ల మందికి ABHA రిజిస్ట్రేషన్లు చేశారు. రాష్ట్రాలవారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ 4.29 కోట్ల అకౌంట్లతో మొదటి స్థానంలో ఉంది. 4,10,49,333 ఖాతాలతో ఏపీ రెండో స్థానంలో ఉంది. 4.04 కోట్లతో మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. దక్షిణాదికి చెందిన మరే రాష్ట్రం టాప్-5లో లేదు. కర్ణాటక 2.35 కోట్ల ఖాతాలతో 8వ స్థానంలో, 98 లక్షల ఖాతాలతో తెలంగాణ 14వ స్థానంలో ఉన్నాయి.

ఈ ప్రయత్నాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో 4.10 కోట్ల ఖాతాలు నమోదై డిజిటల్ హెల్త్ ఖాతాల సృష్టిలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ABHA ప్రతి పౌరుడికి 14-అంకెల డిజిటల్ హెల్త్ IDని అందిస్తుంది, ఇది వారి పూర్తి ఆరోగ్య చరిత్రను కలిగి ఉంటుంది, క్రమం తప్పకుండా నవీకరించబడుతుంది మరియు ఒకే క్లిక్‌తో దేశంలో ఎక్కడి నుండైనా యాక్సెస్ చేయవచ్చు.

7. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మాల్ ఆంధ్రప్రదేశ్‌లో రాబోతోంది

దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మాల్ ఆంధ్రప్రదేశ్_లో రాబోతోంది

విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద  ఇనార్బిట్ మాల్ నగర రూపురేఖలను మారుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

16వ నెంబరు జాతీయ రహదారికి సమీపంలో సాలిగ్రామపురంలోని పోర్టు క్వార్టర్స్ సమీపంలో విశాలమైన స్థలంలో రూ.600 కోట్లతో అభివృద్ధి చేయనున్న కె.రహేజా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం ఐటీ క్యాంపస్ కోసం 2.5 ఎకరాలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా, కంపెనీ అధ్యక్షుడు నీల్ రహేజా అదే స్థలంలో ఫైవ్ స్టార్ లేదా సెవెన్ స్టార్ హోటల్ నిర్మించడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు, మాల్ ప్రాజెక్ట్ ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు 8,000 మందికి ఉపాధి కల్పిస్తుందని పేర్కొన్నారు.

8. నీతి ఆయోగ్ ఏపీలో ‘స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌ఫర్మేషన్’ని ఏర్పాటు చేయనుంది

నీతి ఆయోగ్ ఏపీలో 'స్టేట్ ఇన్_స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్_ఫర్మేషన్'ని ఏర్పాటు చేయనుంది

ఆగస్టు 1వ తేదీన, కేంద్ర ప్రభుత్వం యొక్క థింక్ ట్యాంక్ అయిన నీతి ఆయోగ్, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధిని సులభతరం చేయడానికి స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌ఫర్మేషన్ (SIT)ని స్థాపించాలని యోచిస్తోందని ఒక అధికారి ప్రకటించారు.

రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు అదనపు కార్యదర్శి వి రాధ నేతృత్వంలోని నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి మరియు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించింది. అధికారిక ప్రకటనలో పేర్కొన్న విధంగా అధిక వృద్ధి రేటును సాధించడం మరియు వివిధ రంగాలను అభివృద్ధి చేయడానికి వ్యూహాన్ని రూపొందించడం తో  సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై అధికారులు చర్చించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.

9. ఆంధ్రప్రదేశ్‌లో 11 రైల్వే స్టేషన్‌లను పునరాభివృద్ధి చేయనున్నారు

ఆంధ్రప్రదేశ్_లో 11 రైల్వే స్టేషన్_లను పునరాభివృద్ధి చేయనున్నారు

దేశంలోని 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి ఆగష్టు 6వ తేదీన ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. విజయవాడలో ఆగస్టు 4న జరిగిన మీడియా సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ డీఆర్‌ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. తొలిదశలోఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ డివిజన్‌లో రూ.270 కోట్లతో 11 రైల్వే స్టేషన్‌ల పునరాభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.

తదుపరి దశలో మరో 9 స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. ప్రాజెక్టు మొదటి దశలో అనకాపల్లి, భీమవరం టౌన్, ఏలూరు, కాకినాడ టౌన్, నర్సాపూర్, నిడదవోలు, ఒంగోలు, సింగరాయకొండ, తాడేపల్లిగూడెం, తెనాలి, తుని స్టేషన్లకు అనేక సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. అదనంగా, ABSS (అమృత్ భారత్ స్టేషన్ పథకం) చొరవలో భాగంగా, తెలంగాణలోని 21 స్టేషన్లు కూడా మొదటి దశలో పునరాభివృద్ధికి సిద్ధంగా ఉన్నాయి.

10. వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ లో ఆంధ్రా అమ్మాయి జ్యోతి రికార్డు సృష్టించింది

Andhra Girl Jyoti Created A Record In World University Games

ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్టార్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ మరో విశేషమైన ఘనత సాధించింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన 23 ఏళ్ల మహిళ 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసులో 12.78 సెకన్లలో ఆకట్టుకుని మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సగర్వంగా కైవసం చేసుకుంది.

పురుషుల 200 మీటర్ల ఈవెంట్‌లో అమ్లాన్ బోర్గో హైన్ 20.55 సెకన్లలో అద్భుతమైన సమయంతో ముగించి కాంస్య పతకాన్ని ఖాయం చేయడంతో భారతదేశం ఆగస్టు 4న అథ్లెటిక్స్ పతకాల పట్టికలో చేరింది. ఈ సాధనతో, భారతదేశం యొక్క మొత్తం పతకాల సంఖ్య 11 స్వర్ణాలు, 5 రజతాలు మరియు 9 కాంస్యాలతో 25 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది.

11. మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది

మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది

ఆస్తుల కల్పనకు ఉద్దేశించిన మూలధనం వ్యయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూలధన వ్యయంపై CAG గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. బడ్జెట్లో మూలధన వ్యయం కేటాయింపుల్లో తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40.79 శాతం వ్యయం చేసినట్లు CAG గణాంకాలు తెలిపాయి.

CAG (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) గణాంకాల ప్రకారం, తొలి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం కూడా పెద్దగా పెట్టుబడులు పెట్టలేదు. పలు రాష్ట్రాలు బడ్జెట్ లో మూలధన వ్యయం కేటాయింపుల్లో ఎంత మేర ఖర్చు చేశాయనే అంశాన్ని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. మూలధన కేటాయింపులో ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల కంటే ముందుందని నివేదిక ప్రత్యేకంగా పేర్కొంది. బడ్జెట్ లో మూలధన వ్యయానికి చేసిన కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్, మే నెలల్లోనే ఏకంగా 29.70 శాతం వ్యయం చేసిందని తెలిపింది.

12. N.T రామారావు శతజయంతి సందర్భంగా ₹100 నాణెం విడుదల కానుంది

dyfhcgv

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్మారకార్థం ఆగష్టు 28వ తేదీన ప్రత్యేకంగా రూ.100 నాణేన్ని ఆవిష్కరించనున్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ నాణేన్ని ఆగస్టు 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా విడుదల చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో విడుదల వేడుక జరగనుందని, అక్కడ రాష్ట్రపతి ముర్ము ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సమక్షంలో నాణేన్ని ఆవిష్కరిస్తారని రాష్ట్రపతి భవన్ కార్యాలయం తెలిపింది.

13. టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు

టీటీడీ చైర్మన్_గా భూమన కరుణాకర్_రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు

ఆగస్టు 10వ తేదీ ఉదయం శ్రీవారి ఆలయంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ ప్రాంగణంలో గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి ఆయన చేత ప్రమాణం చేయించారు.

వైయస్‌ఆర్‌ జిల్లా నందలూరు మండలం ఈదరపల్లెలో జన్మించిన భూమన కరుణాకర్‌రెడ్డి. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివారు. వామపక్ష భావజాలంతో ఉన్న ఆయన తర్వాత అధ్యాత్మికత వైపుకు మళ్లారు. గతంలోనూ 2006 నుంచి 2008 వరకు టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా పనిచేశారు.

14. నవంబర్ 5న వైజాగ్ నేవీ మారథాన్ జరగనుంది

నవంబర్ 5న వైజాగ్ నేవీ మారథాన్ జరగనుంది

వైజాగ్ నేవీ మారథాన్ యొక్క రాబోయే ఎనిమిదవ ఎడిషన్ నవంబర్ 5 న జరగనుందని తూర్పు నావికా కమాండ్ (ENC) అధికారులు ప్రకటించారు. ఈ గ్లోబల్ ఈవెంట్ కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని, ఆసక్తి ఉన్నవారు www,vizagnavymarathon.runలో నమోదు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. నేవీ డే వేడుకల్లో అంతర్భాగమైన ‘వైజాగ్ నేవీ మారథాన్’కు పెరుగుతున్న ప్రాధాన్యతను నావికాదళ అధికారి కెప్టెన్ సి.జి.రాజు హైలైట్ చేశారు.

ఆగష్టు 9 న జరిగిన విలేకరుల సమావేశంలో, INS కళింగ కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కమాండర్ C.S. నాయర్, ఈ కార్యక్రమంలో పౌరుల హాజరు కోసం తమ నిరీక్షణను వివరించారు. మంచి ఆరోగ్యం మరియు మానసిక శ్రేయస్సు యొక్క సంస్కృతిని పెంపొందించడం దీని లక్ష్యం

15. మహిళలు బ్యాంకుల్లో డిపాజిట్లు చేసేవారిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది

tdxfc

బ్యాంకుల్లో మహిళలు చేస్తున్న డిపాజిట్ల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఎస్బీఐ రిసెర్చి నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2019 నుంచి 2023 సంవత్సరాల మధ్య డిపాజిట్లు, రుణాలపై సవివర నివేదిక విడుదల చేసింది. మహిళలు చేస్తున్న డిపాజిట్లు పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వాలు మహిళా సాధికారతకు తీసుకుంటున్న చర్యలే స్థిరమైన మహిళా సాధికారతకు ఇవి నిదర్శనం’ అని ఆ నివేదిక పేర్కొంది.

ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం బ్యాంకు డిపాజిట్లలో 35 శాతానికి పైగా మహిళలు ఉన్నారు. 2019 నుంచి 2023 మధ్య కాలంలో దేశంలో మహిళలు తలసరి డిపాజిట్‌ రూ.4,618కి చేరగా, ఆంధ్రప్రదేశ్‌లో రూ.6,444కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో, మార్చి 2023 నాటికి మొత్తం డిపాజిట్లు రూ.4.56 లక్షల కోట్లకు చేరుకున్నాయి, ఈ మొత్తంలో మహిళలు రూ.1.59 లక్షల కోట్లు అని ఎస్బీఐ రిసెర్చి నివేదిక వివరించింది.

16. మాదకద్రవ్యాల వినియోగంలో ఏపీ 12వ స్థానంలో ఉంది

మాదకద్రవ్యాల వినియోగంలో ఏపీ 12వ స్థానంలో ఉంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం వేగంగా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆశ్చర్యకరంగా, కొంతమంది పిల్లలు పదేళ్ల వయస్సులోనే మాదకద్రవ్యాల బారిన పడుతున్నారు. ఏకంగా 3.17 లక్షల మంది బాలలు ఈ మత్తు వలలో చిక్కుకున్నారు. రాష్ట్రంలో 20.19 లక్షల మంది మాదకద్రవ్యాల వ్యసనపరులు ఉండగా వారిలో 15.70 శాతం మంది బాలలే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

పిల్లల్లో అత్యధికంగా గంజాయి వినియోగిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉంది, ఓపియ్స్కు సంబంధిత పదార్థాల వాడకంలో 10వ స్థానంలో మరియు మైనర్లలో మత్తుమందుల వినియోగంలో 8వ స్థానంలో ఉంది. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత మంత్రిత్వ శాఖ స్థాయీ సంఘం తాజాగా పార్లమెంట్ లో ఓ నివేదిక సమర్పించింది.

17. పోలేరమ్మ జాతరను ఏపీ రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది

పోలేరమ్మ జాతరను ఏపీ రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది

వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ అమ్మవారి జాతరను ఏపీ రాష్ట్ర పండుగగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ గుర్తింపునకు అనుగుణంగా జీవో నం.390తో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 11న స్థానిక పోలేరమ్మ ఆలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు, వెంకటగిరి సమన్వయకర్త నేదరుమల్లి రాంకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 21న వెంకటగిరి పర్యటనలో సీఎం జగన్‌ ఇచ్చిన మాటను నిలబెట్టు కున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

18. ఆర్థిక స్థితి పరంగా ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో ఉంది

5trxfgv

2022-23 సంవత్సరానికి సవరించిన బడ్జెట్‌ల ఆధారంగా రాష్ట్ర ర్యాంకింగ్స్‌లో, ఆంధ్రప్రదేశ్ 11వ స్థానానికి పడిపోయింది. ఇది మునుపటి సంవత్సరం, 2021-22 ర్యాంక్‌లలో దాని 8వ స్థానం నుండి క్షీణత. 2022-23లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, చత్తీస్‌గఢ్‌ రెండో స్థానంలో, ఒడిశా మూడో స్థానంలో నిలిచాయి. తెలంగాణ, జార్ఖండ్‌లు వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.

19 రాష్ట్రాలపై డాయిష్ బ్యాంకు ముఖ్య ఆర్థిక వేత్త కౌశిక్ దాస్ ఈ నివేదికను తయారు చేశారు. అందులోని వివరాల ప్రకారం అత్యంత దారుణ స్ధితిలో ఉన్న రాష్ట్రాల జాబితాలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉంది. బెంగాల్ కంటే పంజాబ్, బిహార్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ కాస్త మెరుగ్గా ఉన్నాయి. కేరళ అత్యంత దుర్భరమైన ఆర్ధిక పరిస్థితి ఉన్న ఐదు రాష్ట్రాల జాబితా నుంచి బయటకు వచ్చింది

గుజరాత్ ఆర్థిక స్థితి 2021-22లో ఐదో స్థానం నుంచి 2022-23 నాటికి ఏడో స్థానానికి పడిపోయింది. 2023-24 బడ్జెట్ అంచనాల కోసం ఎదురుచూస్తే, మహారాష్ట్ర తన ఆధిక్యాన్ని నిలుపుకుంది, ఛత్తీస్‌గఢ్ మరియు తెలంగాణ రెండు మరియు మూడవ స్థానాలను కైవసం చేసుకున్నాయి.

19. ఏపీ ఫిషింగ్ హార్బర్‌లను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు

ఏపీ ఫిషింగ్ హార్బర్_లను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు

ఫిషింగ్ హార్బర్‌లు కేవలం చేపల వేటకే పరిమితం కాకుండా పర్యాటక ప్రదేశాలుగా వాటిని తీర్చిదిద్దనున్నారు. వాటి సమీపంలో రిసార్ట్‌లు, వెల్‌నెస్ సెంటర్లు, వాటర్ పార్కులు, వినోద ఉద్యానవనాలు ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షించేందుకు ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

పర్యాటకుల డిమాండ్ అధికంగా ఉన్న హార్బర్లను పరిశీలించి అక్కడ పర్యాటక అవకాశాలపై అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా తొలి దశలో అభివృద్ధి చేస్తున్న జువ్వెలదిన్నె, నిజాంపట్నం, ఉప్పాడ, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్లలో మచిలీపట్నం వద్ద పర్యాటక అవకాశాలు అధికంగా ఉన్నట్లు గుర్తించింది. ఈ నాలుగు ఫిషింగ్ హార్బర్లలో పర్యాటక ఏర్పాట్లు చేయడం ద్వారా ఏటా రూ.131 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా.

20. ఏపీ మారిటైమ్ బోర్డు శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్‌ను నిర్మించనుంది

ఏపీ మారిటైమ్ బోర్డు శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్_ను నిర్మించనుంది

ఆంధ్రప్రదేశ్‌లో, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రెండు దశల్లో తొమ్మిది ఫిషింగ్ హార్బర్‌లను నిర్మిస్తోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో ఏపీ మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో 10వ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో, రాష్ట్రంలోని విస్తృతమైన 974 కిలోమీటర్ల తీరప్రాంతంలో విస్తరించి ఉన్న 555 మత్స్యకార గ్రామాల నుండి 6.3 లక్షల మత్స్యకార కుటుంబాలకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ తొమ్మిది ఫిషింగ్ హార్బర్‌ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.3,520 కోట్ల పెట్టుబడి పెడుతోంది.

21. ఈడీఎక్స్‌ సంస్థతో ఏపీ ఉన్నత విద్యాశాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది

WhatsApp Image 2023-08-18 at 4.53.09 PM

ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా అగ్రశ్రేణి ఆన్‌లైన్ కోర్సులకు ప్రవేశం పొందే అద్భుతమైన చొరవను సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ కోర్సుల సర్టిఫికెట్ల ద్వారా ఉపాధి అవకాశాలను మరియు ఉద్యోగ అవకాశాలను మెరుగుపడతాయని తెలిపారు.  తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆగష్టు 17 న ఎడెక్స్ సంస్థతో ఏపీ ఉన్నత విద్యాశాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పంద పత్రాలపై ఎడెక్స్ వ్యవస్థాపకుడు, CEO అనంత్ అగర్వాల్, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు సంతకాలు చేశారు.

22. ఇండియా టుడే ర్యాంకింగ్ సిస్టమ్‌లో SPMVV 35వ స్థానంలో ఉంది

ఇండియా టుడే ర్యాంకింగ్ సిస్టమ్_లో SPMVV 35వ స్థానంలో ఉంది

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (SPMVV) గౌరవనీయమైన ఇండియా టుడే జాతీయ స్థాయి ర్యాంకింగ్ సిస్టమ్‌లో, ప్రత్యేకంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల విభాగంలో 35వ ర్యాంక్‌ను సాధించడం ద్వారా ప్రశంసనీయమైన మైలురాయిని సాధించింది. ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ (IQAC)లో ప్రొఫెసర్ టి త్రిపుర సుందరి మరియు ఆమె బృందం మొదటి ప్రయత్నంలోనే మెరుగైన ర్యాంక్ సాధించినందుకు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి భారతి అభినందించారు.

23. దేశంలోనే చిరుధాన్యాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉంది

దేశంలోనే చిరుధాన్యాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్_ ప్రథమ స్థానంలో ఉంది (1)

దేశంలోనే చిరుధాన్యాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ప్రభుత్వ సహకారంతో చిరుధాన్యాల సాగు చేసే రైతులు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అధిక దిగుబడులు సాధిస్తున్నారు.  NABARD 2022-23 రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 2022లో చిరు ధాన్యాల దిగుబడిలో దేశంలోనే నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. చిరు ధాన్యాలు మొత్తం 1.52 లక్షల హెక్టార్లలో సాగు చేయగా 3.6 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అంటే హెక్టార్‌కు 2,363 కిలోలో దిగుబడి వచ్చింది. గుజరాత్ 2,310 కిలోలతో ఆ తర్వాత స్థానంలో ఉంది. వీటిలో జొన్నల దిగుబడిలో ఏపీ టాప్‌లో నిలిచింది. హెక్టార్‌కు 3,166 కేజీల దిగుబడి వచ్చింది. ఆ తర్వాత స్థానం మధ్యప్రదేశ్‌కు (1941 కేజీలు) దక్కింది.

రాష్ట్రవ్యాప్తంగా చిరు ధాన్యాల సాగు విస్తీర్ణంలో రాజస్థాన్ దాదాపు 35.5 శాతం, మహారాష్ట్ర 20 శాతం, కర్నాటక మొత్తం విస్తీర్ణంలో 13 శాతం వాటాను కలిగి ఉందని వెల్లడైంది.

24. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ చెల్లింపుదారులు భారీగా పెరిగారు

dszxc

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిగువ మధ్యతరగతి మరియు మధ్యతరగతి ప్రజల ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఫలితంగా ఆదాయాన్ని వెల్లడించి ప్రభుత్వానికి పన్ను చెల్లించే ట్యాక్స్ పేయర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. గత మూడు సంవత్సరాలలో, రాష్ట్రంలో పన్ను చెల్లించే వ్యక్తుల సంఖ్య 1.8 మిలియన్లు (18 లక్షలు) పెరిగింది, దేశవ్యాప్తంగా ఏ ఇతర రాష్ట్రంలోనూ ఇంతటి పెరుగుదల లేదని ఎస్బీఐ రీసెర్చ్ సంస్థ తెలియజేసింది.

దేశవ్యాప్తంగా, 2015-2020 మధ్య పన్ను చెల్లింపుదారుల మొత్తం పెరుగుదల 3.81 కోట్లు, అయితే ఈ సంఖ్య 2020-2023 మధ్య కేవలం 1 కోటికి  పడిపోయింది. ఇతర రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇలానే ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆ ఐదేళ్లలో కేవలం 5 లక్షల మందే ట్యాక్స్ పేయర్లు పెరిగినట్లు ఎస్బీఐ తెలియజేసింది. మొత్తంగా చూస్తే 2015– 2023 మధ్య రాష్ట్రంలో 23 లక్షల మంది ట్యాక్స్ పేయర్లు పెరిగారు.

25. సింగపూర్ మ్యాథ్స్ ఒలింపియాడ్ లో రజతం సాధించిన తిరుపతి బాలుడు

సింగపూర్ మ్యాథ్స్ ఒలింపియాడ్ లో రజతం సాధించిన తిరుపతి బాలుడు

ప్రతిష్టాత్మక సింగపూర్ ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ ఛాలెంజ్ (SIMOC)లో తిరుపతికి చెందిన నాలుగో తరగతి విద్యార్థి రాజా అనిరుధ్ శ్రీరామ్ రజత పతకం సాధించాడు. ఈ అద్భుత విజయం అతని కుటుంబానికి, పాఠశాలకు గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాడు.

SIMOC లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన 23 మంది భారతీయులలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజా అనిరుధ్ ఒక్కరే పాల్గొన్నారు. 32 దేశాలకు చెందిన 2000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో యువ గణిత మేధావులు తమ నైపుణ్యాలను, పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికగా నిలిచింది.

26. ఏపీలో సోలార్ డీహైడ్రేషన్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు

4yrtfhg

రాష్ట్రవ్యాప్తంగా సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలను ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (APSFPS) CEO ఎల్.శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. పొదుపు సంఘాలతో సంబంధం ఉన్న మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించడంతోపాటు ఉల్లి, టమోటా రైతులకు ఏడాది పొడవునా సరసమైన ధరలను అందించడం దిని  ప్రాథమిక లక్ష్యం. కర్నూలు జిల్లాలో 100 యూనిట్లతో ప్రారంభమైన పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోదించారు మరియు రాష్ట్రవ్యాప్తంగా వాటి విస్తరణను ప్రతిపాదించారు. ఫలితంగా, రూ.84 కోట్ల పెట్టుబడితో మొత్తం 5,000 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ఆగష్టు 21 న విజయవాడలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. సొసైటీ సీఈవో శ్రీధర్రెడ్డి, BOB డీజీఎం చందన్ సాహూ ఎంవోయూపై సంతకాలు చేశారు.

27. టమోటా ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది

45yetdhgc

దేశవ్యాప్తంగా టమోటా ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, రాష్ట్రం గణనీయమైన 23.37 లక్షల మెట్రిక్ టన్నుల టమోటా దిగుబడిని అందించింది, ఇది దేశం యొక్క మొత్తం టొమాటో ఉత్పత్తిలో 11.30 శాతానికి దోహదపడింది. దీనిని ప్రస్తావిస్తూ, ఇటీవల టమాటా ధరలు పెరగడానికి గల కారణాలు మరియు సవాళ్లను హైలైట్ చేస్తూ NABARD ఒక నివేదికను విడుదల చేసింది. ప్రధానంగా దేశంలో టమాటాలు ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో 2022-23లో ఉత్పత్తి భారీగా తగ్గిందని నివేదిక తెలిపింది. అయితే ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ మాత్రం అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2022 – 23లో 1.50 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించింది. ప్రధానంగా టమాల ధరల పెరుగుదలకు గుజరాత్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల్లో ఉత్ప త్తి గణనీయంగా తగ్గడమేనని NABARD తెలిపింది.

28. ఏపీ సీఎం జగన్ 3 పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు

ఏపీ సీఎం జగన్ 3 పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగష్టు 23 న నంద్యాల జిల్లాలో 5,314 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినట్లు ప్రెస్ నోట్ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (APGENCO) ముఖ్యమంత్రి సమక్షంలో నేషనల్ హైడ్రో-ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) తో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. ఈ అవగాహనా ఒప్పందము పంప్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఓక్ మండలం జునుతల గ్రామంలో గ్రీన్కో ఏర్పాటు చేయనున్న 2300 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుకు, పాణ్యం మండలం కందికాయపల్లె గ్రామంలో ఏఎం గ్రీన్ ఎనర్జీ ఏర్పాటు చేయనున్న 700 మెగావాట్ల సోలార్, 314 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లకు, బేతంచెర్ల మండలం ముద్దవరం గ్రామంలో ఎకోరెన్ ఎనర్జీ ఏర్పాటు చేయనున్న 1000 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులలో మొత్తం పెట్టుబడి రూ.25,850 కోట్లు, దీనితో వేల మందికి ఉపాధి దొరుకుతుంది.

29. డిజిటల్ చెల్లింపుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది

ETFV

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పరిశోధన నివేదిక ప్రకారం భారతదేశంలోని టాప్ 15 రాష్ట్రాలు డిజిటల్ చెల్లింపుల విలువ మరియు పరిమాణంలో 90% వాటాను కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో సగటు డిజిటల్ చెల్లింపు మొత్తం ₹2,000 మరియు ₹2,200 మధ్య ఉంది.

ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక తర్వాత ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌లలో డిజిటల్‌ చెల్లింపులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో సగటు డిజిటల్ చెల్లింపులు ₹1,800 నుండి ₹2,000 వరకు ఉన్నాయి. వీటి తర్వాత ఒడిశా, కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్, అస్సాం మరియు హరియాణాల్లో డిజిటల్ చెల్లింపుల మొత్తం ₹1,600 మరియు ₹1,800 మధ్య ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

డిజిటల్ చెల్లింపుల్లో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తం 8-12% వాటాను కలిగి ఉందని నివేదిక పేర్కొంది. భారతదేశంలోని మొదటి 100 జిల్లాలు జిల్లాలవారీగా UPI డిజిటల్ చెల్లింపుల పరిమాణం మరియు విలువలో 45% వాటాను కలిగి ఉన్నట్లు తేలింది.

30. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిష్టాత్మక జైవిక్ ఇండియా అవార్డు లభించింది

rdgfvc

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రకృతి సాగు, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు జైవిక్ ఇండియా అవార్డు దక్కింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (ICCOA) సంస్థ 2023కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జైవిక్ ఇండియా అవార్డును ప్రకటించింది. జాతీయ స్థాయిలో 10 విభాగాల్లో 51 అవార్డులను వెల్లడించగా ఇందులో రాష్ట్రానికి 3 అవార్డులు దక్కడం విశేషం.

పల్నాడు జిల్లా అమరావతి మండలం అత్తలూరులో ఉన్న అత్తలూరుపాలెం ఆర్గానిక్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎఫ్‌పీఓ), బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం చిమటావారిపాలెంకు చెందిన గనిమిశెట్టి పద్మజ కూడా జైవిక్‌ ఇండియా అవార్డులకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 7న ఢిల్లీలో జరగనున్న ‘బయోఫ్యాక్ ఇండియా నేచురల్ ఎక్స్‌పో’లో ఈ అర్హులైన వారిని సత్కరించనున్నారు.

31. మూల ధన వ్యయంలో ఏపీ అగ్రస్థానంలో ఉంది

fsdxc (1)

ప్రస్తుత ఆర్దిక సంవత్సరం మూల ధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది. ఏప్రిల్ నుంచి జూలై వరకు మూల ధన వ్యయంపై కాగ్ విడుదల చేసిన గణాంకాల ద్వారా రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని స్పష్టమైంది. కాగ్ గణాంకాల ప్రకారం, ఏప్రిల్ నుండి జూలై వరకు నాలుగు నెలల వ్యవధిలో రాష్ట్ర పరిపాలన బడ్జెట్ నుండి కేటాయించిన మూలధన వ్యయంలో 47.79 శాతం ఉపయోగించుకుంది. ఆంధ్రప్రదేశ్ మరియు కేరళ రెండింటిలోనూ ప్రారంభ నాలుగు నెలల మూలధన వ్యయం గణాంకాలను కాగ్ పేర్కొంది

ప్రత్యేకించి, ఏప్రిల్ మరియు జూలై మధ్య కేరళ బడ్జెట్‌లోని మూలధన వ్యయం కేటాయింపులో 28.19 శాతం మాత్రమే ఖర్చు చేసినట్లు కాగ్ పేర్కొంది. ఏప్రిల్ నుండి జూలై మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ మూలధన వ్యయం రూ. 14,844.99 కోట్లు, బడ్జెట్‌లో మూలధన వ్యయం కేటాయింపులో 47.79 శాతానికి ఉందని తెలిపింది. మరోవైపు ఇదే నాలుగు నెలల్లో కేరళ మూలధన వ్యయం రూ. 4,117.87 కోట్లు, బడ్జెట్ కేటాయింపులో 28.19 శాతం అని వెల్లడించింది.

32. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి ఏపీ సీఎం, కేంద్ర విద్యాశాఖ మంత్రి శంకుస్థాపన చేశారు

సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి ఏపీ సీఎం, కేంద్ర విద్యాశాఖ మంత్రి శంకుస్థాపన చేశారు

విజయనగరం జిల్లా మెంటాడ మండలం చినమేడపల్లి గ్రామంలో రూ.830 కోట్లతో నిర్మించనున్న సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆగస్టు 25న శంకుస్థాపన చేశారు. 830 కోట్ల అంచనా బడ్జెట్‌తో ఈ విశ్వవిద్యాలయం 562 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. మూడేళ్ల వ్యవధిలో ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని అంచనా.

33. చిన్న నీటి పారుదల పథకాల అమలులో తెలంగాణ 5వ, ఏపీ 9వ స్థానంలో నిలిచాయి

dc

దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న చిన్నతరహా సాగునీటి పథకాల్లో తెలంగాణ 5, ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉన్నాయి. కేంద్ర జలశక్తి శాఖ ఆగష్టు 26 న  విడుదల చేసిన చిన్నతరహా నీటిపారుదల పథకాల 6వ సెన్సస్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2017-18 సంవత్సరానికి సంబంధించిన డేటా ఆధారంగా జలవనరుల శాఖ ఈ మూల్యాంకనాన్ని నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ (17.2%), మహారాష్ట్ర (15.4%), మధ్యప్రదేశ్ (9.9%), తమిళనాడు (9.1%), తెలంగాణ (7.3%) రాజస్థాన్ (6.4%) కర్ణాటక (6.1%), గుజరాత్ (6.0%), మరియు ఆంధ్రప్రదేశ్ (5.1%), పంజాబ్ (5.1%) తొలి పది స్థానాలను ఆక్రమించాయి. 2013-14నాటి 5వ సెన్సస్ తో పోలిస్తే తాజా సెన్సన్నాటికి తెలంగాణలో చిన్నతరహా నీటి పథకాలు 10.4% పెరిగాయి.

34. ఏపీ పాఠశాల విద్యలో ప్రథమ భాష సబ్జెక్టుగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టనున్నారు

ఏపీ పాఠశాల విద్య లో ప్రథమ భాష సబ్జెక్టుగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టనున్నారు

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ పాఠశాల విద్యలో సంస్కృతాన్ని ప్రాథమిక భాషగా చేర్చాలని నిర్ణయించింది. ఈ చొరవలో భాగంగా, పాఠశాల విద్యా శాఖ అధికారికంగా ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదనను సమర్పించింది మరియు అధికారిక ఆదేశాలు త్వరలో వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మార్పు ప్రకారం, సంస్కృతాన్ని తమ ప్రాథమిక భాషగా ఎంచుకున్న విద్యార్థులు హిందీని వారి ద్వితీయ భాషగా తెలుగుతో భర్తీ చేస్తారు, అయితే ఇంగ్లీష్ తృతీయ భాషగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా, తెలుగును తమ ప్రాథమిక భాషగా ఎంచుకున్న వారు హిందీని రెండవ భాషగా, ఇంగ్లీషును మూడవ భాషగా అధ్యయనం చేస్తారు.

35. పంప్‌డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది

పంప్_డ్_ స్టోరేజీ ప్రాజెక్టుల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది

దేశంలోని ఇతర రాష్ట్రాలకు విద్యుత్ రంగంలో ఆదర్శవంతమైన సంస్కరణలు మరియు మార్గదర్శక సాంకేతిక పురోగమనాలకు దారితీసిన ఆంధ్రప్రదేశ్, మరో అద్భుతమైన మైలురాయిని సాధించింది. భవిష్యత్తులో సంభావ్య విద్యుత్ కొరతను  పరిష్కరించేందుకు, పంప్‌డ్ స్టోరేజీ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ (PSP)ని ప్రవేశపెట్టి, అమలు చేయడంలో రాష్ట్రం ముందుంది, PSP సామర్థ్యంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ ముఖ్యమైన విజయాన్ని కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఆంధ్ర ప్రదేశ్ తరువాత, రాజస్థాన్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలు తదుపరి స్థానాలను ఆక్రమించాయి.

Download AP State Current Affairs August 2023 Monthly PDF

CHANAKYA Current Affairs Special MCQs Batch | Online Live Batch in Telugu By Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆగస్టు 2023 నెల కరెంట్ అఫైర్స్ తెలుగులో_40.1