Andhra Pradesh State Current affairs In Telugu June 2022: Andhra Pradesh state current affairs plays crucial role in GROUP-1, GROUP-2, Panchayat Secretary, GROUP-4 , Assistant Engineer(AE), Sub-Inspector and Constable, Junior Lecturers etc., exams.. Andhra Pradesh Government releases notification for Various posts through Andhra Pradesh like GROUP-1, GROUP-2, Panchayat Secretary, GROUP-4 , Assistant Engineer(AE), Sub-Inspector and Constable, Junior Lecturers, Degree Lecturers and various executive and non-executive posts under various departments of Telangana. Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. To complement your preparation, we are providing you the Andhra Pradesh State Current affairs In Telugu June 2022.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ జూన్ 2022 తెలుగులో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ GROUP-1, GROUP-2, పంచాయితీ సెక్రటరీ, GROUP-4, అసిస్టెంట్ ఇంజనీర్(AE), సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్స్ మొదలైన పరీక్షలలో కీలక పాత్ర పోషిస్తుంది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. APPSC ద్వారా GROUP-1, GROUP-2, పంచాయితీ సెక్రటరీ, GROUP-4, అసిస్టెంట్ ఇంజనీర్ (AE), సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు మరియు వివిధ ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు తెలంగాణలోని వివిధ విభాగాల క్రింద. కరెంట్ అఫైర్స్ పోటీ పరీక్షల్లో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కాబట్టి, ప్రభుత్వ పరీక్షలకు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు అభ్యర్థులు దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ప్రిపరేషన్‌ను పూర్తి చేయడానికి, మేము మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్‌ను జూన్ 2022 తెలుగులో అందిస్తున్నాము.
APPSC/TSPSC Sure shot Selection Group
Andhra Pradesh State Current affairs In Telugu | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ తెలుగులో
1. ఏపీలో రెండో అధికార భాషగా ఉర్దూ
ఏపీలో రెండో అధికార భాషగా ఉర్దూను గుర్తిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి చట్టంలో చేసిన సవరణలు జూన్ 16 నుంచి అమలులోకి వచ్చినట్లుగా పేర్కొంది. ఈ మేరకు యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ ఉత్తర్వులు జారీ చేశారు.
2. జిందాల్ పవర్ ప్రాజెక్టు ప్రారంభం
పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఓబులునాయుడుపాలెం (నాయుడుపేట) వద్ద రూ.340 కోట్లతో నిర్మించిన వ్యర్థాలతో విద్యుత్తును ఉత్పత్తి చేసే జిందాల్ పవర్ ప్రాజెక్టును సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. సంబంధిత పైలాన్‌ను ఆవిష్కరించారు. గంటకు 15 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేసే ఈ ప్రాజెక్టులో 28 మున్సిపాలిటీల నుంచి సేకరించే పొడి చెత్తను వినియోగిస్తారు.
3. విశాఖకు ఇన్ఫోసిస్
దేశంలో అతిపెద్ద టెక్నాలజీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ విశాఖపట్నంలో భారీ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. ప్రారంభంలో సుమారు 1,000 సీటింగ్ సామర్థ్యంతో యూనిట్ ఏర్పాటు చేయడానికి ఇన్ఫోసిస్ ముందుకు వచ్చినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. దాదాపు 1,000 సీట్లతో ప్రారంభించి రానున్న కాలంలో మరింతగా విస్తరించి మూడువేల సీట్లకు పెంచే విధంగా ఇన్ఫోసిస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
విశాఖలో క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించి ఆ సంస్థ గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హెడ్ నీలాద్రిప్రసాద్ మిశ్రా, రీజనల్ హెడ్ అమోల్ కులకర్ణి మంత్రి అమర్‌నాథ్‌తో పాటు అధికారులతో సమావేశమయ్యారు. సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ యూనిట్ కోసం ప్లగ్ అండ్ ప్లే విధానానికి మధురవాడ సమీపంలో అందుబాటులో ఉన్న భవనాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
4. ఏపీకి నాలుగు స్కోచ్ అవార్డులు
ఆంధ్రప్రదేశ్‌ను నాలుగు స్కోచ్ అవార్డులు వరించాయి. 2021 సంవత్సరానికి గాను జౌళి, పశు సంవర్ధక, మత్స్యసంపద, వ్యవసాయ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకు ఈ అవార్డులు దక్కాయి. ఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్‌లో జరిగిన 83వ స్కోచ్ సమ్మిట్‌లో ఇండియా గవర్నెన్స్ ఫోరం అవార్డులను ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక, మత్య్స సంపద, డెయిరీ అభివృద్ధి శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అవార్డును అందుకున్నారు.
5. AP: మహిళా మార్ట్స్
స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు సుస్థిర జీవనోపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పొదుపు సంఘాల్లోని సభ్యులతో గ్రూపులు ఏర్పాటు చేసి ‘చేయూత’ మహిళా సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ప్రతి జిల్లాకు ప్రయోగాత్మకంగా రెండు మహిళా మార్ట్‌లు ఏర్పాటు చేసేందుకు విధి విధానాలను రూపొందించింది.
వీటికి ఆదరణ లభిస్తే భవిష్యత్‌లో ప్రతి మండలానికి ఒకటి చొప్పున విస్తరించాలనే యోచనలో ఉన్నారు. జిల్లాలో మార్ట్‌లు ఏర్పాటుకు స్థానిక వెలుగు ఆధ్వర్యంలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. స్వయం సహాయక సంఘాల బలోపేతం, మహిళలకు సుస్థిర ఆదాయం కల్పనే లక్ష్యంగా వైఎస్సార్ చేయూత రిటైల్ స్టోర్లను ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఈ దుకాణాలకు తక్కువ ధరలకు నాణ్యమైన సరుకులు పంపిణీ చేసేలా రిలయన్స్, ఐటీసీ, హెచ్‌యూఎల్, పీఅండ్‌జీ వంటి కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. పరిమితంగా ఉన్న ఈ వ్యాపారాన్ని విస్తరించి నిర్వాహకులకు సుస్థిర జీవనోపాధిని కల్పించడంతో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లోనూ మహిళా మార్ట్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా గ్రామీణ వినియోగదారులకు నాణ్యమైన నిత్యావసర సరుకులు సరసమైన ధరలకు అందించేలా చర్యలు తీసుకోనున్నారు. నగరాల్లోని మాల్స్‌కు దీటుగా వీటిని తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
6. Khelo India 2022: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఏపీ క్రీడాకారుల సత్తా
ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2021లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సత్తాచాటారు. 19 క్రీడాంశాల్లో పోటీపడగా 13 (4 స్వర్ణ, 4 రజత, 5 కాంస్య) పతకాలు కైవసం చేసుకున్నారు. అత్యధికంగా స్వర్ణ పతకాలు సాధించిన రాష్ట్రాల జాబితాలో ఏపీ 15వ స్థానంలో నిలిచింది. ఈ నెల 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు హరియాణాలోని పంచ్‌కులలో అండర్–18 బాలబాలికల ఖేలో ఇండియా పోటీలు నిర్వహించారు.
విజేతలు వీరే
వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో ఎస్.పల్లవి (స్వర్ణం), సీహెచ్.శ్రీలక్ష్మి (స్వర్ణం), ఎస్‌కే లాల్ భషీర్ (రజతం), పి.ధాత్రి (రజతం), డీజీ వీరేష్ (రజతం), ఆర్.గాయత్రి (కాంస్యం), అథ్లెటిక్స్ విభాగాల్లో కుంజా రజిత (స్వర్ణం), ఎం.శిరీష (కాంస్యం), కబడ్డీలో మహిళల జట్టు కాంస్యం, ఆర్చరీలో కుండేరు వెంకటాద్రి (స్వర్ణం), మాదాల సూర్యహంస (కాంస్యం), ఘాట్కాలో బాలురు జట్టు కాంస్యం, బాక్సింగ్‌లో అంజనీకుమార్ (రజతం).
7. APSSDC: ఏపీఎస్‌ఎస్‌డీసీకి జాతీయ గుర్తింపు
నైపుణ్యాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) అమలు చేస్తోన్న కొత్త విధానాలకు జాతీయ గుర్తింపు లభించింది. కర్ణాటకలో జరుగుతున్న 2వ ఇండిగ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న నూతన స్కిల్ విధానాలను అభినందిస్తూ అవార్డు వచ్చినట్లు ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రకటన విడుదల చేసింది.
5 రాష్ట్రాలకు చెందిన 20కిపైగా యూనివర్సిటీ విద్యార్థులు, 20 రంగాలకు చెందిన పరిశ్రమలు పాల్గొన్న ఈ సమ్మిట్‌లో న్యూ ఆక్టివిటీస్ అండ్ క్యాస్కేడింగ్ స్కిల్ సిస్టమ్ గురించి ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రెజెంటేషన్ ఇచ్చింది. దానికి అవార్డు లభించడంపై ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ ఎస్ సత్యనారాయణ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.
8. ఏపీలో ఎలాంటి కాన్పులైనా అమ్మకు 5,000
ఏ తరహా ప్రసవాలు జరిగినా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద తల్లులకు రూ.ఐదు వేల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సహజ ప్రసవమైనా, సిజేరియన్ జరిగినా ఈ మొత్తాన్ని అందించాలన్నారు. గతంలో సిజేరియన్ జరిగితే రూ.3 వేలే ఇస్తున్నారని, దీన్ని రూ.5 వేలకు పెంచాలని సూచించారు. సహజ ప్రసవమైనా, సిజేరియన్ అయినా తల్లీబిడ్డల సంరక్షణ ముఖ్యం కాబట్టి ఒకే మొత్తాన్ని ఇవ్వాలన్నారు.
సహజ ప్రసవాల సంఖ్యను పెంచడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అవగాహన, చైతన్యం కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, క్యాన్సర్ కేర్, కోవిడ్ తదితరాలపై సీఎం జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ..
9. విశాఖలో ప్రతిష్టాత్మక ఐసీఐడీ కాంగ్రెస్
అంతర్జాతీయంగా అత్యంత ప్రతిష్టాత్మక ఐసీఐడీ(ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్) 25వ కాంగ్రెస్ నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది. వచ్చే ఏడాది నవంబర్ 6 నుంచి 13 వరకూ విశాఖపట్నంలో ఐసీఐడీ 25వ కాంగ్రెస్‌తో పాటు, ఆ సంస్థ 75వ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఐఈసీ) సమావేశం నిర్వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా 78 దేశాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. ప్రపంచానికి జలభద్రత చేకూర్చడం, తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటల సాగుకు దోహదం చేసే అత్యాధునిక నీటి పారుదల విధానాలపై సమావేశంలో చర్చిస్తారు.
ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి 10 వరకూ ఐసీఐడీ 24వ కాంగ్రెస్, 74వ ఐఈసీ సమావేశాలు ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో జరగనున్నాయి. జల వనరుల సంరక్షణ తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటల సాగు విధానాలపై అధ్యయనం చేసి, వాటి ఫలితాలను ప్రపంచానికి అందించడమే లక్ష్యంగా 1950, జూన్ 24న సిమ్లా వేదికగా ఐసీఐడీ ఆవిర్భవించింది. ఐసీఐడీ తొలి కాంగ్రెస్‌ను 1951, జనవరి 11–16 వరకూ ఢిల్లీలో నిర్వహించారు. 1953, జూన్‌లో బెంగళూరు వేదికగా నాలుగో సమావేశాన్ని నిర్వహించారు. ఐసీఐడీ ఆరో కాంగ్రెస్‌ను దేశంలో చివరగా ఢిల్లీలో 1966, జనవరి 4–13 వరకూ నిర్వహించారు.
10. త్వరలో బీఎస్–6 ఆయిల్
భారత్ స్టేజ్ –6 (బీఎస్–6) వాహనాలు విన్నాం, ఇక నుంచి బీఎస్–6 ఆయిల్ కూడా అందుబాటులోకి రానుంది. ఇందుకు విశాఖ కేంద్రంగా మారనుంది. తక్కువ కాలుష్యాన్ని మాత్రమే వదులుతూ వాహనాల ఇంజన్ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు బీఎస్–6 ఆయిల్ దోహదపడనుంది. దీన్ని ఉత్పత్తి చేసేందుకు విశాఖలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) రిఫైనరీ సిద్ధమవుతోంది. దేశానికి విశాఖ నుంచే బీఎస్–6 పెట్రోల్/డీజిల్ సరఫరా కానుంది అనడంలో అతిశయోక్తి లేదు.
ఇందుకోసం ప్రస్తుతం ఉన్న రిఫైనరీ సామర్థ్యాన్ని ఏడాదికి 8.3 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీపీఏ) సామర్థ్యం నుంచి 15 ఎంఎంటీపీఏకు పెంచేందుకు విస్తరణ, ఆధునికీకరణ పనులను సంస్థ చేపడుతోంది. ఇందుకోసం ఏకంగా రూ.26,264 కోట్లను వెచ్చిస్తోంది. అన్నీ అనుకూలిస్తే 2023 మార్చి నాటికి విశాఖ కేంద్రంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు బీఎస్–6 పెట్రోల్/డీజిల్ సరఫరా కానుంది.
11. అమ్మ ఒడికి రూ.6,594.60 కోట్లు
రాష్ట్రంలో ఏ ఒక్కరి చదువులకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతో నవరత్నాల్లో భాగంగా జగనన్న అమ్మఒడి పథకం కింద ఈ ఏడాది 43,96,402 మంది తల్లులకు లబ్ధి చేకూర్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో 54 శాతం మంది బీసీలు, 21 శాతం మంది ఎస్సీలు, 6 శాతం మంది ఎస్టీలు, 19 శాతం మంది ఓసీలు ఉన్నారు. ఈ పథకం కింద ఈ నెల 27న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.6,594.60 కోట్లను సీఎం జమ చేయనున్నారు. ఈ ఏడాది కొత్తగా అమ్మ ఒడి పరిథిలోకి 5,48,329 మంది తల్లులు వచ్చారు. ఈ పథకం ద్వారా 82,31,502 మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు.
12. జీశాట్–24 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం
ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్–5 రాకెట్ ద్వారా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్), కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్(డీఓఎస్) సంయుక్తంగా రూపాందించిన జీశాట్–24 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని బుధవారం వేకువజామున విజయవంతంగా రోదసీలోకి ప్రవేశపెట్టారు. 4,180 కిలోల బరువు కలిగిన జీశాట్–24 ఉపగ్రహాన్ని నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.
ఈ ఉపగ్రహంలో 24 కేయూ బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్లు అమర్చి డీటీహెచ్ అప్లికేషన్ అవసరాలను తీర్చేందుకు పాన్ ఇండియా కవరేజీతో రోదసీలో పంపారు. ఇప్పటిదాకా 4వేల కిలోల పైన బరువు కలిగిన భారీ ఉపగ్రహాలను కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించడంలో భాగంగా ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. జీశాట్–25తో డీటీహెచ్ అప్లికేషన్‌లో నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లో రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 30న సాయంత్రం 6 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ53 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
13. ఏపీ @ గ్రీన్ ‘పవర్’
ప్రకృతి ప్రసాదించిన వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఇటు కాలుష్య రహితమైన విద్యుదుత్పత్తి అటు అన్నదాతలకు ఆర్థిక లాభం, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. భౌగోళిక పరిస్థితుల అనుకూలత కారణంగా రాష్ట్రంలో 30 వేల మెగావాట్లకు పైగా పవన్, సౌర విద్యుత్తు లాంటి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి అపార అవకాశాలున్న నేపథ్యంలో దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించింది.
అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.15,376 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన పంప్డ్ స్టోరేజ్ విద్యుదుత్పత్తి కేంద్రంతో పాటు పలు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది.
14. రాష్ట్రంలో మరో భారీ సిమెంట్ ప్లాంటు ఏర్పాటు
రాష్ట్రంలో మరో భారీ సిమెంట్ ప్లాంటు ఏర్పాటు కానుంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో ప్రఖ్యాత శ్రీ సిమెంట్ కంపెనీ తమ తదుపరి ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంట్‌ను రూ. 2,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ సిమెంట్ యాజమాన్యం పేర్కొంది.
ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల క్లింకర్, 3 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు శ్రీ సిమెంట్ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. దేశంలో ప్రస్తుతం ఉన్న శ్రీ సిమెంట్ కంపెనీ ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 46.4 మిలియన్ టన్నులుగా ఉంది. ఉత్పత్తి సామర్థ్యంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో 64 శాతం వినియోగించుకుంది. రూ. 2,500 కోట్ల పెట్టుబడిని అంతర్గతంగా, రుణాల ద్వారా సమీకరించనున్నట్లు కంపెనీ పేర్కొంది.
15. విశాఖలో అంతర్జాతీయ యానిమేషన్ చిత్ర నిర్మాణం
అంతర్జాతీయ యానిమేషన్ చిత్రం ‘నోహాన్ ఆర్క్’ విశాఖ కేంద్రంగా రూపుదిద్దుకోనుంది. విశాఖ ఐటీ పార్కులోని సింబయాసిస్ టెక్నాలజీస్ సంస్థలో అమెరికా, బ్రెజిల్ దేశాలకు చెందిన నిర్మాతలు దీనిని నిర్మిస్తున్నారు. ఇందుకోసం రూ.45 కోట్లను వెచ్చిస్తున్నారు. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో యానిమేషన్ ఫిల్మ్‌గా దీనిని రూపొందిస్తున్నట్టు సింబయాసిస్ టెక్నాలజీస్ సీఈవో ఓ.నరేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. చిత్ర నిర్మాణంలో భాగంగా సముద్రంలో తుపానులను సృష్టించే వీఎఫ్‌ఎస్‌ల కోసం ప్రత్యేక కంప్యూటర్లను వినియోగిస్తామన్నారు.
ఇటువంటి అంతర్జాతీయ చిత్రాలు మరిన్ని నిర్మించడానికి వీలుగా వీఎఫ్‌ఎక్స్, లైవ్‌ల్యాబ్, డబ్బింగ్ స్టూడియో, ఫిల్మ్ ల్యాబ్‌లను సిద్ధం చేశామన్నారు. షార్ట్ ఫిల్మ్‌లు, యాడ్ ఫిల్మ్‌లు చిత్రీకరించి, ఎడిటింగ్, డబ్బింగ్ చేసే విధంగా అత్యున్నత సదుపాయాలను తమ సంస్థలో నెలకొల్పడం జరిగిందన్నారు. అంతర్జాతీయ యానిమేషన్ చిత్రాల రూపకల్పనలో విశాఖకు మంచి గుర్తింపు లభించినట్టుగా తాము భావిస్తున్నామన్నారు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |