2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.50.65 లక్షల కోట్ల అంచనాలతో కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 01, 2025న పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం భారీగా కేటాయింపులు ప్రకటించింది. ఈ కథనంలో కేంద్ర బడ్జెట్ 2025లో AP కి కేటాయింపులను గురించి తెలుసుకోండి.
కేంద్ర బడ్జెట్ 2025 లో ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్ కేటాయింపులు:
పోలవరం ప్రాజెక్టుతో పాటు, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు నిధులు కేటాయించారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి
- పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు
- పోలవరం నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా రూ.12,157 కోట్లు
- విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.3,295 కోట్లు
- విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు
- రాష్ట్రంలోని ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ.162 కోట్లు
- రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.240 కోట్లు
- ఏపీ ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు రెండో దశకు రూ.242.50 కోట్లు
- లెర్నింగ్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఆపరేషన్‌కు మద్దతుగా రూ.375 కోట్లు
- రాష్ట్రంలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు రూ.186 కోట్లు
ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్ లాభం చేకూర్చే కేటాయింపులు
తిరుపతి IIT సామర్థ్య విస్తరణకు బడ్జెట్‌లో ప్రాధాన్యం
2014 తర్వాత ఏర్పాటు చేసిన ఐదు ఐఐటీల్లో మరిన్ని విద్యార్థులకు వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కొత్తగా 6,500 మంది విద్యార్థులకు వసతులు కల్పించనుండగా, తిరుపతి ఐఐటీకి భారీగా నిధులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 240 సీట్లు ఉన్న ఈ ఐఐటీలో సదుపాయాలు పెంచితే, ప్రవేశాల సంఖ్య కూడా పెరగనుంది.
విద్యలో ప్రత్యేక కేటాయింపులు:
- రూ.500 కోట్లతో ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ ఏర్పాటు
- AI విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రం నుంచి మద్దతు
- ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు పెద్దపీట
- వచ్చే ఐదేళ్లలో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు
ఈ కేటాయింపుల వల్ల ఏపీకి మరిన్ని ప్రయోజనాలు అందే అవకాశం ఉంది.
విశాఖపట్నం పోర్ట్ ట్రస్టుకు రూ.730 కోట్లు కేటాయింపు
కేంద్రం విశాఖపట్నం పోర్ట్ ట్రస్టుకు కేటాయింపులను గణనీయంగా పెంచింది. 2024-25 బడ్జెట్‌లో రూ.150 కోట్లు కేటాయించిన కేంద్ర నౌకాయాన శాఖ, అంచనాల సవరణ సమయంలో దీనిని రూ.285 కోట్లకు పెంచింది.
ఇప్పుడు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.730 కోట్లు కేటాయించింది.
- గత బడ్జెట్‌తో పోల్చితే ఇది 386% పెరుగుదల
- సవరించిన అంచనాల కంటే 156% ఎక్కువ
ఈ భారీ కేటాయింపులతో విశాఖ పోర్ట్ అభివృద్ధి మరింత వేగంగా జరుగనుంది.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.11,917 కోట్లు కేటాయింపులు
కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేటాయింపులను అనూహ్యంగా పెంచింది.
- 2024-25 బడ్జెట్‌లో తొలుత కేవలం రూ.620 కోట్లు కేటాయించిన కేంద్ర ఉక్కుశాఖ, తాజాగా సవరించిన అంచనాల ప్రకారం ఆ మొత్తాన్ని రూ.8,622 కోట్లకు పెంచింది.
- 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.3,295 కోట్లు కేటాయించింది.
- ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి స్టీల్‌ప్లాంట్‌కు మొత్తం రూ.11,917 కోట్లు కేటాయించారు.
మొత్తం నిధుల విభజన:
- రూ.11,418 కోట్లు – బడ్జెట్ సపోర్ట్ రూపంలో
- రూ.499 కోట్లు – అంతర్గత బడ్జెటరీ వనరుల ద్వారా
ఈ మొత్తం ఇటీవల ప్రకటించిన రూ.11,440 కోట్ల ప్యాకేజీ కంటే ఎక్కువ.
- 2023-24లో స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించిన రూ.636.46 కోట్లు పూర్తిగా ఖర్చు చేసింది.
- ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించిన మొత్తాన్ని కేంద్ర ఆర్థికశాఖ ఈక్విటీ షేర్‌గా పెట్టుబడి పెట్టనుంది.
దీంతో కేంద్రం ఇటీవల ప్రకటించిన ప్యాకేజీ పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చినట్లు స్పష్టమైంది.
ఉడాన్ పథకం కింద రాష్ట్రానికి కొత్త విమాన సేవలు
రాష్ట్రంలోని పలు ప్రాంతాలను అనుసంధానించేందుకు కొత్త విమాన సర్వీసులను అందుబాటులోకి తేవనున్న అవకాశం ఉంది. ఉడాన్ పథకం కింద అదనంగా 120 మార్గాల్లో విమాన సేవలు అందుబాటులోకి తేవాలని కేంద్రం ప్రతిపాదించింది.
- ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉన్న విమానాశ్రయాల నుంచి వాణిజ్య కార్యకలాపాలను పెంచేందుకు ‘ఉడాన్’ పథకం అమలు
- విమానాశ్రయాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వీజీఎఫ్ (వయబిలిటీ గ్యాప్ ఫండింగ్) ద్వారా మద్దతు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విమాన సర్వీసుల ప్రతిపాదనలు
- కడప, కర్నూలు విమానాశ్రయాల నుంచి మాత్రమే ఉడాన్ సర్వీసులు నడిపే అవకాశం
- కర్నూలు- విశాఖపట్నం, బెంగళూరు, చెన్నైకి, కడప- విజయవాడ, హైదరాబాద్, చెన్నై మధ్య కొత్త సర్వీసుల ప్రతిపాదనలు
- రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (APADCL) పౌర విమానయాన సంస్థకు ప్రతిపాదనలు పంపింది
కొత్త విమానాశ్రయాల అభివృద్ధికి ప్రణాళిక
ప్రాంతాల మధ్య కనెక్టివిటీ పెంచేందుకు కుప్పం, దగదర్తి, ఒంగోలు, తాడేపల్లిగూడెం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తుని-అన్నవరంలో విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు దృష్టి సారిస్తే, ఉడాన్ పథకం కింద కొత్త సర్వీసులు, విమానాశ్రయాల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంది.