నిజాంల కాలంలో, విద్య వ్యాప్తి చెందడంతో ముస్లిం మహిళల్లో సామాజిక సంస్కరణ వేగంగా వచ్చింది. నిజాం స్త్రీలు మహిళల ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపు పొందారు. నిజాం రాజ్యంలో స్త్రీవిద్యపై ఆంక్షలు అమలయ్యాయి. బ్రిటిష్ ప్రత్యక్ష పాలన ఉన్న చోట ఆడవారు చదువుకునే అవకాశం ఉండేది. కానీ హైదరాబాదులో మాత్రం ఆరో నిజాం కాలం వరకు మహిళలకు సరైన విద్య అందుబాటులో లేదు. తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాలలు వెలిశాయి. మహిళల అభివృద్ధికి ఎందరో కృషి చేశారు. ఆ సమయంలో విద్యావంతులైన మహిళలు అనేక రంగాల్లో తమ ప్రతిభను చాటే దిశగా, అభ్యుదయ ఆలోచనలను వ్యాపింపజేయడానికి ఎన్నో రచనలు చేశారు మరియు సంస్థలను నెలకొల్పారు. చైతన్య సారథులయ్యారు. సాంఘిక సంస్కరణల్లో, స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములయ్యారు. ఈ పరిణామ క్రమంపై పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలి.
APPSC/TSPSC Sure shot Selection Group
నిజాం రాజ్యంలో మహిళల అభివృద్ధి: ఏర్పడిన సంస్థలు
ఆరో నిజాం కాలం(1907)లో ముస్లిం ఆడపిల్లల కోసం హైదరాబాదులో జనానా పాఠశాల స్థాపించారు. 1909 నుంచి ఇందులో తరగతులు ప్రారంభమయ్యాయి. 1930 నాటికి 79 బాలికల పాఠశాలలు వెలిశాయి. వీటిల్లో హిందూ, ముస్లిం విద్యార్థినులు చేరారు. అందులో చాలామంది నిజాం రాజ్యంలో పనిచేసే అధికారులు పిల్లలే. పురుషులు కూడా తమ కుటుంబాల్లో స్త్రీలను విద్యావంతులను చేయడానికి ఆసక్తి చూపారు, ఎంతో కృషి చేశారు. వారి అభ్యున్నతికి పత్రికలు స్థాపించారు.
- సయ్యద్ ముంతాజ్ అలీ తన భార్య మొహమ్మదీ బేగంతో కలిసి తహజీబ్-ఉన్-నిసాన్ (నాగరిక స్త్రీ) అనే పత్రికను 1898లో స్థాపించారు.
- షేక్ అబ్దుల్ హదీప్, ఆయన భార్య జహానా బేగం అలీగఢ్ 1904లో ఖాతూన్ (స్త్రీ) అనే పత్రికను ప్రారంభించారు.
- అంజుమన్-ఇ-ఖవాతిన్-ఇ-ఇస్లాం (ముస్లిం స్త్రీ గుర్తింపు) అనే సంస్థ ఏర్పాటు చేశారు.
- అప్పట్లో మారానీ బేగం సాయిబా రచించిన తాలిమ్-ఇ-నిస్సాన్ (స్త్రీ విద్య)లో పిల్లల పెంపకం గురించి ఉంది.
- 19వ శతాబ్దంలో మహిళల స్థితిని మార్చడానికి ఆరో నిజాం కొంతవరకు ప్రయత్నించాడు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కూడా స్త్రీ విద్యపై శ్రద్ధ వహించాడు. ఫలితంగా 1936 నాటికి 677 ప్రాథమిక, 28 మాధ్యమిక, 4 ప్రత్యేక శిక్షణ పాఠశాలలు ఏర్పాటయ్యాయి.
- 1936లో ‘బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్’ స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాలల్లో కొత్త సిలబస్ ను ప్రవేశపెట్టింది. పరిశుభ్రత, పౌష్టికాహారం, వంట, కుట్లు, ప్రాథమిక చికిత్స, నర్సింగ్, బాలల సంక్షేమం, లాండ్రీ లాంటి గృహసంబంధ విద్యలను ‘డొమెస్టిక్ సైన్స్’ పేరుతో సిలబస్ లో చేర్చారు.
- మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వామనరావు, వినాయకరావు, కేశవరావు కొరాట్కర్ తదితరులు స్త్రీ విద్యను వ్యాప్తి చేశారు.
- వివేకవర్ధని, సావిత్రి, ఆర్య కన్యా పాఠశాలలు ఏర్పాటై స్త్రీ విద్యావ్యాప్తికి దోహదపడ్డాయి.
- ఆంధ్ర మహాసభ కార్యక్రమాల ఫలితంగా మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెరిగాయి.
- బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పద్మజా నాయుడు స్వదేశీ లీగ్ ను ప్రారంభించారు.
- హైదరాబాదులో సత్యాగ్రహంలో పాల్గొన్న మొదటి మహిళ జ్ఞానకుమారి హెడా. టి. వరలక్ష్మమ్మ అనే స్త్రీ వైద్య నిపుణురాలు దేవరకొండలో జరిగిన రెండో ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించారు. ఈమె స్త్రీ ఆరోగ్య విద్యా పరిషత్తును స్థాపించారు.
- నడింపల్లి సుందరమ్మ ‘ఆంధ్ర సోదరీ సమాజం’ సంస్థను స్థాపించి స్త్రీల అభ్యున్నతికి పాటుపడ్డారు.
- అహల్యాబాయి, కుట్టివెల్లోడి సుమిత్రాదేవి, టి.ఎస్.సదాలక్ష్మి. ఈశ్వరీబాయి, సంగం లక్ష్మీబాయమ్మ తదితరులు స్త్రీల ప్రగతికి, సంఘ సంస్కరణలకు కృషి చేశారు.
అసఫ్ జాహీల కాలం నాటి మహిళా రచయితలు
ఆరో, ఏడో నిజాంల పాలనా కాలంలో జరిగిన విద్యాభివృద్ధి వల్ల అనేక మంది మహిళలు పలు రచనలు చేశారు.
- ఈతరం మొదటి రచయిత్రి పరిగికి చెందిన రూప్ ఖాన్ పేట్ రత్నమ్మ. ఈమె బాలబోధ, వెంకటరమణ శతకం, శ్రీనివాస శతకం, శివకుమార విజయం, దశావతార వర్ణన లాంటి గ్రంథాలను రాశారు.
- హనుమకొండకు చెందిన నందగిరి ఇందిరాదేవి అదృష్ట శిఖరం, ఘోషాయాత్ర, ప్రేమమయి, పేరులు-దారులు (వ్యాసాలు) రచించారు.
- కోడికుంపటి, తెలివైన ఘటం, ఉజ్వలనారి, మంచుకొండల్లో మహిళ, నేను మాబాపు, కులమా- ప్రేమా లాంటి రచనలను ఎల్లాప్రగడ సీతాకుమారి చేశారు.
- తేజోమూర్తులు, స్వర్ణకమలాలు, జాతిరత్నాలు, నారిజగత్తు తదితర రచనలు ఇల్లందుల సరస్వతీ దేవి రచించారు.
- హనుమకొండకు చెందిన సోమరాజు ఇందిరాదేవి శకుంతల, రామాయణం కావ్యాలను రాశారు.
- మహబూబ్ నగర్ వాసి పాకాల యశోదారెడ్డి రచనల్లో చిరుగజ్జెలు, ఎల్లాప్రగడ, అమరజీవులు ఉన్నాయి.
నిజాం రాజ్యంలో ప్రముఖ స్త్రీలు
నిజాం రాజ్యంలో మహిళల విద్యాభివృద్ధితో ఎందరో స్త్రీలు వివిధ రంగాల్లో తమ విశిష్ట ప్రతిభను చాటారు.
ప్రిన్సెన్ దుర్రుషెవర్
ఈమె ఒట్టోమన్ సామ్రాజ్య చివరి వారసుడు అబ్దుల్ మజీద్ ఖాన్ (చివరి ఖలీఫా) కుమారై. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పెద్ద కుమారుడు అజంజాను వివాహం చేసుకున్నారు. దాంతో ఆమె బీరార్ కు రాణి అయ్యింది. 1940లో హైదరాబాద్లో మొదటి ఎయిర్ పోర్ట్ ను, ఉస్మానియా ఆస్పత్రిని ప్రారంభించారు. పిల్లల, సార్వత్రిక ఆస్పత్రిని మొదలుపెట్టారు. ‘ప్రిన్సెస్ దుర్రుషెవర్ బాలికల కళాశాల’ను స్ధాపించారు. ఈమె కుమారులే ముకరంజా, ముఫకంజా.
మసూమా బేగం:
ఈమె 1901, అక్టోబరు 7న డాక్టర్ ఖాదిల్ జంగ్ దంపతులకు హైదరాబాద్లో జన్మించారు. ఉర్దూ భాషలో ప్రతిభను ప్రదర్శించినందుకు బంగారు పతకం అందుకున్నారు. 1927లో స్థాపించిన ‘ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ లో అనేక హోదాల్లో పనిచేసి 1962 – 1964లో అధ్యక్షురాలయ్యారు. 1934 నుంచి దాదాపు దశాబ్దం పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం సెనెట్ సభ్యురాలిగా, ఆర్థిక సంఘం సభ్యురాలిగా సేవలందించారు. 1960లో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. భారతదేశంలో మంత్రి పదవి చేపట్టిన మొదటి ముస్లిం మహిళ మసూమా బేగం. ఈమెకు లేడీ బాడెన్ పావెల్ పతకాన్ని ప్రదానం చేశారు.
ఆరుట్ల కమలాదేవి:
ఈమె అసలు పేరు రుక్మిణి. ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరు లో 1920లో జన్మించారు. హైదరాబాద్లోని మాడపాటి హనుమంతురావు బాలికల పాఠశాలలో చదువుకున్నారు. ‘కమలాదేవి వంటశాల’ పేరుతో కొలనుపాకలో వయోజన విద్యాలయాన్ని నడిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజల పక్షాన పోరాటం చేశారు. 1943లో విజయవాడలో నిర్వహించిన మహిళా ఆత్మరక్షణ శిబిరంలో శిక్షణ తీసుకున్నారు. 1952లో సార్వత్రిక ఎన్నికల్లో ఆలేరు నుంచి అత్యధిక మెజారిటీతో శాసనసభకు ఎన్నికయ్యారు. భారతదేశంలోని రాష్ట్రాల్లో మొదటి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా కమలాదేవి చరిత్ర సృష్టించారు.
సంగం లక్ష్మీబాయమ్మ:
రంగారెడ్డి జిల్లాలోని ఘట్కేసర్ లో జన్మించారు. గుంటూరులో ఉన్నవ దంపతులు స్థాపించిన శారదా సదన్ లో చదువుకున్నారు. మద్రాసులో బీఏ పాసయ్యారు. తెలంగాణ తొలి తరం పట్టభద్రుల్లో ఈమె ఒకరు. 1930-1932లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 1933 వరకు రాయవెల్లూరు జైల్లో శిక్ష అనుభవించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం మెదక్ లోక్సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. తిరుమల రామచంద్ర రచించిన ‘హంపి నుంచి హరప్పా దాకా’ అనే ఆత్మకథలో సంగం లక్ష్మీబాయమ్మ మద్రాసు జీవితం, ఆమె మానవతామూర్తిత్వ విశేషాలు ఉన్నాయి. హైదరాబాద్లోని సంతోష్ నగర్ లో బూర్గుల రామకృష్ణారావు కుమారై ఇందిర పేరిట ‘ఇందిరా సేవాసదన్’ అనే అనాథాశ్రమాన్ని స్థాపించారు. అక్కడే ‘నా జైలు జ్ఞాపకాలు-అనుభవాలు’ అనే ఆత్మకథను రచించారు.
ప్రేమలతా గుప్త:
నిజాం ప్రభుత్వంలో విద్యాశాఖ కార్యదర్శి అయిన ఎల్.ఎన్.గుప్త భార్య ఈమె. స్త్రీ హక్కుల కోసం పోరాటం చేశారు. హైదరాబాద్లో ‘ట్రైనింగ్ సోషల్ వెల్ఫేర్ వర్కర్స్’ పథకాన్ని ప్రారంభించారు.
థెహ్మీనా బాయి థాగే :
అలీగఢ్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ డిగ్రీ అందుకున్నారు. 1950లో హైదరాబాద్ చిల్డ్రన్ సొసైటీని స్థాపించారు. 1955లో సొంత డబ్బుతో ‘రాధాకిషన్ హోం’ అనే అనాథాశ్రమాన్ని, అనాథ బాలికల కోసం ‘రాధాకృష్ణ గర్ల్స్ హోం’ను నెలకొల్పారు.
నీలోఫర్
నీలోఫర్-ఫర్హిత్ బేగం సాహిబా ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రెండో కోడలు. ఈమె టర్కీ మాజీ రాజు అబ్దుల్ మజీద్ మేనకోడలు. తన సేవకురాళ్లలో ఒకరు కాన్పు సమయంలో మరణించడంతో చలించిపోయి, రెడ్ హిల్స్ ప్రాంతంలో నీలోఫర్ ఆస్పత్రిని కట్టించారు. ఆ కాలంలో ప్రపంచంలోని పది మంది అత్యంత అందమైన యువతుల్లో నీలోఫర్ ఒకరు. గొప్ప క్రీడాకారిణి.
Development of Women in Nizam’s Kingdom PDF
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |