తెలంగాణ పండుగలు & జాతరలు: తెలంగాణ రాష్ట్రం యొక్క పండుగలు మరియు జాతరలు దాని ప్రత్యేక సంస్కృతి, ప్రజలు మరియు భాషను ప్రదర్శిస్తాయి. ఈ పండుగలు & జాతరలు దాని రాష్ట్ర సంస్కృతిని వర్ణిస్తాయి. ఈ వ్యాసంలో మేము తెలంగాణ పండుగలు & జాతరల గురించి చాలా ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తున్నాము.
Adda247 APP
తెలంగాణ పండుగలు మరియు జాతరలు
బతుకమ్మ
- తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక ఈ పండుగ బతుకమ్మ పండుగను ఆశ్వయుజమాసం శుద్ధ పాడ్యమి రోజు నుండి వరుసగా 9 రోజులు జరుపుకుంటారు.
- బతుకమ్మ పండుగలో ప్రధానాంశాలు – పువ్వులు, నీరు, ప్రకృతి
- తంగేడుపూలు, గునుగుపూలు, బంతి, చామంతి, కట్లపూవు, తామెర, దోసపూవు, గడ్డిపూవు మొదలగు పూలను ఒక పళ్ళెంలోనో, తాంబాళంలోనో, వెదురు పల్లకిలోనో ఎత్తుగా పేర్చి పైన పసుపుతో చేసిన గౌరీమాత ను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు.
- గౌరమ్మ శివుడి భార్య పార్వతికి మరో పేరు కాబట్టి మొదటిరోజు శివాలయాల్లో బతుకమ్మలు ఆడుతారు.
- మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, చివరిదైన 9వ రోజు సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. 6వ రోజు బతుకమ్మ ఆడరు. ఈ రోజును అర్రెం అంటారు.
- మలీద (మల్లీల ముద్దలు) : సద్దుల బతుకమ్మ రోజు న నైవేద్యంగా మలీదను సమర్పిస్తారు.
- 2014 జూన్ 16 న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది.
- బండారు సుజాత శేఖర్ తెలంగాణ బతుకమ్మ పాటల మీద పరిశోధన చేసి తెలంగాణ బతుకమ్మ పౌరాణిక, సామాజిక, సాంస్కృతిక పరిశీలన పేరుతో గ్రంథాన్నిరాశారు.
బతుకమ్మ పండుగ – ముఖ్యమైన రోజులు
బతుకమ్మ పండుగ – ముఖ్యమైన రోజులు | ||
రోజు | బతుకమ్మపేరు | నైవేద్యం |
1వరోజు | ఎంగిలిపూల బతుకమ్మ (ఎంగిలిపడ్డాక తిన్నాక) పేరుస్తారు | నువ్వులు, నూకలు |
2వరోజు | అటుకుల బతుకమ్మ | ఉడకబెట్టిన పప్పు, బెల్లం, అటుకులు |
3వరోజు | ముద్దపప్పు బతుకమ్మ | తడిబియ్యం, పాలు, బెల్లం |
4వరోజు | నానబియ్యం బతుకమ్మ | తడిబియ్యం, పాలు,బెల్లం |
5వరోజు | అట్ల బతుకమ్మ | అట్లు |
6వ రోజు | అలిగిన బతుకమ్మ | బతుకమ్మ ఆడరు |
7వరోజు | వేపకాయల బతుకమ్మ | బియ్యపుపిండిని వేపపండ్ల ఆకారంలో తయారు చేస్తారు |
8వరోజు | వెన్నముద్దల బతుకమ్మ | వెన్న, నువ్వులు, బెల్లం |
9వరోజు | సద్దుల బతుకమ్మ | సత్తుపిండి,నువ్వులపిండి, బెల్లం |
బోనాలు
- బోనాలు పండుగ జూలై/ఆగస్టులో వచ్చే ఆషాడ మాసంలో జరుపుకునే వార్షిక పండుగ మరియు ఈ పండుగ సమయంలో మహంకాళి దేవిని పూజిస్తారు.
- ఈ పండుగలో, “బోనం” (తెలుగులో భోజనం అని అర్థం) ఇది పాలు మరియు బెల్లం రెండింటిలో వండిన అన్నం అమ్మవారికి ప్రధాన నైవేద్యంగా ఉంటుంది. బోనాల పండుగ తంతును ఊరడి అని వ్యవహరిస్తారు.
- బోనాల సందర్భంగా గరగ నృత్యాన్ని ప్రదర్శిస్తారు.
- మహిళలు అత్యంత భక్తి, శ్రద్దలతో కొత్తకుండలో పాలు, బెల్లం, అన్నంతో నైవేద్యాన్ని తయారుచేసి, ఆ కుండ పైన ఒక దీపం వెలిగిస్తారు. కుండ చుట్టూ పసుపు, కుంకుమ, వేపరెమ్మలతో అలంకరించి తలపై పెట్టుకొని డప్పు వాయిద్యాలతో అమ్మవారి గుడికి తీసుకువెళ్ళి బోనాన్ని సమర్పిస్తారు.
- బోనాల పండుగ సమయంలో మహంకాళి అమ్మవారిని, ‘ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, నూకాలమ్మ మొదలగు పేర్లతో అమ్మవారికి బోనం సమర్పిస్తారు.
- పోతురాజు: గ్రామదేవతల సోదరుడైన పోతురాజు ఒంటినిండా పసుపు, “కుంకుమ పూసుకొని, కాళ్ళకు గజ్జెలు కట్టుకొని, చేతిలో కొరడాపట్టుకొని డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తాడు. ఒకప్పటి బైండ్ల పూజారి ప్రతిరూపమే ఈ పోతురాజు.
- పూనకం వచ్చిన పోతురాజుకు భక్తులు మేకపోతును అందిస్తారు. పోతురాజు తన దంతాలతో ఆ మేకపోతు మెడను కొరికి తల, మొండెం వేరు చేసి పైకి ఎగురవేస్తాడు. దీనినే గావుపట్టడం అంటారు.
- బోనాలు ఆషాడం మాసం మొదటి ఆదివారం గోల్కొండ కోటలోని ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రారంభం అవుతాయి. తదుపరి వారం ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్, బల్కంపేట ఎల్లమ్మ ఆలయాలలో పండుగ జరుపుకుంటారు. చివరకు పాతబస్తీ లోని హరిబౌలిలోని అక్కన్న, మాదన్న దేవాలయము వారి ఘటముతో ఏనుగు అంబారీపై, అశ్వాల మధ్య అక్కన్న, మాదన్న బొమ్మల నడుమ ఊరేగింపు మొదలయ్యి సాయంత్రానికి నయాపూల్ వద్ద ఘటముల నిమజ్జనంతో ముగుస్తుంది.
- 1908లో మూసినది వరదల వల్ల తీవ్రనష్టం జరుగుతున్న సందర్భంలో మీర్ మహబూబ్ అలీఖాన్ (6వ నిజాం) హిందూమత సాంప్రదాయాల ప్రకారం మీరాలమండి వద్ద గల మహంకాళి దేవతకు బోనం సమర్పించాడని పేర్కొంటారు.
- ఘటోత్సవం: ఘటం అంటే అమ్మవారి ఆకృతిలో అలంకరించిన రాగి కలశం. ఘటోత్సవం అంటే కలశంతో ఎదురెళ్ళి అమ్మవారికి స్వాగతం పలకడం. అమ్మవారిని ఆవాహన చేసి పుర వీధుల్లో ఘటాన్ని ఊరేగిస్తారు.
- రంగం: రంగం అనేది బోనాల పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది. పండుగ మరునాడు పూనకం వచ్చిన శివసత్తులు వేపమండలు పట్టుకొని జుట్టు విరబోసుకొని, మొహం నిండా పసుపు పూసుకొని, బోర్లించిన పచ్చి మట్టికుండపై నిలబడి భవిష్యవాణి చెప్పుతారు.
- ఈ పచ్చికుండను కుమ్మరి రత్తయ్య వంశీయులు తయారుచేస్తారు.
- అమ్మవారి పూజారిగా ముదిరాజ్ కులస్థురాలు బోనాల రోజు ఉపవాసం చేసి, తరువాత రోజు “రంగం” పేరుతో భవిష్యవాణి చెబుతుంది.
- బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం 2014 జూన్ 16న రాష్ట్ర పండుగగా ప్రకటించింది
బొడ్డెమ్మ పండుగ
- బొడ్డి అంటే చిన్నపిల్ల అని అర్ధం. బొడ్డెమ్మను పెళ్లికాని ఆడ పిల్లలు మాత్రమే ఆడతారు.
- బొడ్డెమ్మ పండుగ భాద్రపద మాసంలో బహుళ పంచమి. రోజునుండి మహాలయ అమావాస్య వరకు కనీసం 9 రోజులు జరుపుకుంటారు.
- పండుగ మొదటిరోజు ఒక పీటమీద పుట్టమన్నుతో బతుకమ్మ ఆకారంలో త్రికోణ గోపురంగా నిర్మించి, దానిచుట్టూ ‘తంగేడు, ‘కట్లపూవులతో అలంకరిస్తారు.
- బొడ్డెమ్మ పండుగ చివరిరోజున కలశంలో తొమ్మిదిరోజులు పోసిన బియ్యంతో పాయసం తయారుచేసి ఆరగింపు చేసి, సామూహికంగా భుజిస్తారు.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర
- పాలకుల అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన తల్లి మరియు కుమార్తె, సమ్మక్క మరియు సారలమ్మ యొక్క ధైర్యసాహసాలను గుర్తుచేసుకోవడానికి ఈ పండుగ జరుపుకుంటారు.
- సమ్మక్క సారలమ్మ జాతర అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర.
- తెలంగాణ కుంభమేళా గా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను పిలుస్తారు
- ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరలో ఒకటిగా పేరుగాంచింది.
- ఈ పండుగ ప్రతి సంవత్సరం మాఘ మాసంలో (జనవరి – ఫిబ్రవరి,) పౌర్ణమి రాత్రి మరియు నాలుగు రోజుల వ్యవధిలో జరుపుకుంటారు.
- శక్తివంతమైన గిరిజన దేవతల ఆశీస్సులు పొందేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఈ జాతరకు హాజరైతారు.
ఏడుపాయల జాతర
- మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసాని పల్లి గ్రామంలో మంజీరానది ఏడుపాయలుగా వేరుపడేచోట పెద్దగుట్ట సొరంగం వద్ద వనదుర్గాదేవి దేవాలయం ఉంది.
- కావున దీనిని ఏడుపాయల జాతరగా పేర్కొంటారు.
- ఈ గుడి పెద్దగుట్ట సొరంగంలో ఉన్నందున దీనిని గరుడగండ అని కూడా పిలుస్తారు.
- ప్రతి సంవత్సరం మహా శివరాత్రి రోజునుండి ఈ జాతరను 3 రోజుల పాటు నిర్వహిస్తారు.
- ఈ జాతరలో కొలిచే దేవత – వనదుర్గా భవానీ
- ఈ జాతరకు దగ్గరలో పాపాల మడుగు ఉంది. అందులో స్నానం చేస్తే పాపాలు పోతాయని ప్రతీతి.
- జాతరలో భక్తులు ఏడు పాయలలో స్నానమాచరించి, ఒకరోజు రాత్రి గుడిలో నిద్రించి తెల్లవారి తమ ఊళ్ళకు వెళ్లిపోతారు.
- ఈ జాతరలో మరో ప్రాముఖ్యత ఏమనగా 18 కులాలకు చెందిన ప్రతినిధులు జాతరలో పాల్గొని తమ తమ కులవృత్తులు, సాంప్రదాయ పద్దతుల ప్రకారం పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు.
- రథోత్సవంతో ఏడుపాయల జాతర ముగుస్తుంది.
కేస్లాపూర్ నాగోబా జాతర
- తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ గ్రామంలో ఈ జాతర జరుగుతుంది.
- ఇది ఆదిలాబాద్‌లో రెండవ అతిపెద్ద గిరిజన పండుగ.
- ఈ జాతర ఐదు రోజుల పాటు సాగుతుంది, ఇక్కడ మేసారం వంశ సభ్యులు వివిధ వేడుకలు మరియు ఆచారాల ద్వారా సర్ప దేవుడిని పూజిస్తారు.
- నాగోబా అంటే నాగదేవత. పామును దేవతరూపంలో పూజిస్తారు. ఈ జాతరను ప్రధానంగా గోండు తెగకు చెందిన మెస్రం వంశీయులు జరుపుతారు.
- మెస్త్రం వంశానికి చెందిన సుమారు 20 మంది గిరిజనులు కొత్త కుండలతో కడైం మండలంలోని గొడి సిర్యాల ప్రాంతంలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను తీసుకువచ్చేందుకు సుమారు 80 కిలోమీటర్లు కాలినడకన బయలుదేరడంతో నాగోబా జాతర ప్రారంభమవుతుంది.
- నదీజలంతో కెస్లాపూర్ చేరుకొని జాతర ప్రాంగణంలో ప్రఖ్యాతి గల మర్రిచెట్టు కింద విడిదిచేసి అమావాస్య రోజు నాగోబా దేవతకు ఆ గోదావరి జలాలతో అభిషేకం చేస్తారు.
- ఈ జాతరలో ఆ సంవత్సరం చనిపోయిన తమ పెద్దల పేరున ‘తూం పూజలు’ నిర్వహిస్తారు.
- నాగోబా జాతర సందర్భంగా గోండులు చేసే నృత్యం గుస్సాడి నృత్యం
కొండగట్టు జాతర
- జగిత్యాల జిల్లా ముత్యంపేట గ్రామ సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో కొండగట్టు జాతర జరుగుతుంది.
- హనుమంతుని భక్తులు 45 రోజుల పాటు “హనుమాన్ దీక్ష”లో పాల్గొంటారు మరియు తరువాత పవిత్ర స్నానం చేస్తారు.
- ఈ దేవాలయంలో విగ్రహం ఒకవైపు నరసింహస్వామి . మరొకవైపు ఆంజవేయస్వామి ముఖాలను కలిగి ఉంటుంది.
- ఈ హనుమంతుడి విగ్రహం శంఖు, హృదయంలో సీతారాములను కలిగి ఉండటం విశేషం. మరియు ఈ గుడిలోని స్వామికి 40 రోజులు పూజలు చేస్తే సంతానం కలుగుతుందని భక్తులు భావిస్తారు.
- ఆంజనేయస్వామి క్షేత్ర పాలకుడైన చేతాలస్వామి ఆలయం కొండపైన ఉన్నది.
- కొండపైన ఇంక సీతమ్మ కన్నీటిధారలు, శ్రీరాముని పాదముద్రలు కలవు.
- కొండగట్టులో కొండల్, బొజ్జపోతన గుహలు ఉన్నాయి.
దసరా పండుగ
- విజయదశమిని దసరా లేదా నవరాత్రి అని కూడా పిలుస్తారు, ఇది తెలంగాణలో జరుపుకునే ముఖ్యమైన హిందూ పండుగ.
- చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన విజయదశమి పండుగను తెలంగాణ అంతటా సంప్రదాయ ఉత్సాహంతో, భక్తితో, ఉల్లాసంగా జరుపుకుంటారు.
- విజయదశమి అనే పేరు సంస్కృత పదాల “విజయ-దశమి” నుండి వచ్చింది, అంటే దశమి రోజున విజయం. దశమి అనేది హిందూ క్యాలెండర్ నెలలో పదవ చంద్ర రోజు.
పీర్ల పండుగ
- తెలంగాణ రాష్ట్రంలో పీర్ల పండుగ అని కూడా పిలువబడే మొహరం ఒక ముఖ్యమైన పండుగ.
- షియా తెగ వాళ్ళు ఈ పండుగను పాటిస్తారు.
- దైవప్రవక్త ముహమ్మదుగారి మనమళ్ళు హసన్, హుసేన్ ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పీరుల్ని ఊరేగిస్తారు.
కొమురవెల్లి మల్లన్న జాతర
- ఈ జాతర సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి గ్రామంలో జరుగుతుంది.
- కొమురవెల్లిలో ప్రధానదేవుడు – మల్లిఖార్జునస్వామి (మల్లన్న). ఈ దేవతను మహారాష్ట్ర ప్రజలు ఖండోబా అని కూడా పిలుస్తారు
- ప్రతి సంవత్సరం మాఘమాసం నుండి ఉగాది పర్వదినం వరకు జాతర జరుగుతుంది.
- ఇక్కడ పూజారులను ఒగ్గు పూజారులు అంటారు.
- మల్లిఖార్జునస్వామి వారి ఆలయ ఆవరణలో గల గంగిరేణి చుట్టు ప్రదిక్షణలు చేసి వొళ్ళబండ / వల్లుబండ వద్ద కోరికలు కోరుతారు.
- మహాదేవుడే మల్లన్నగా అవతరించి బలిజ కులానికి చెందిన బలిమేడల దేవిని పెళ్ళాడినట్లు భక్తులు నమ్ముతారు.
చిత్తారమ్మ జాతర
- హైదరాబాద్‌లోని గాజుల రామారంలో పేద, అణగారిన వర్గాల ఆరాధ్య దేవత చిత్తారమ్మ దేవి ఆలయం ఉంది.
- తెలంగాణ ప్రాంతంలో అత్యంత ప్రజాదరణ పొందిన జాతరలో ఇది ఒకటి.
- చిత్తారమ్మ జాతర అనేది హైదరాబాద్‌లోని గుజాలరామరామ ఆలయంలో జరిగే ప్రసిద్ధ ఆలయ ఉత్సవం. సాంప్రదాయ తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ జాతర పుష్య మాసంలో జరుపుకుంటారు.
ఐనవోలు (ఐలోని) మల్లన్న జాతర
- తెలంగాణ రాష్ట్రం, వర్ధన్నపేట మండలం వరంగల్ జిల్లా ఐనవోలు గ్రామంలో ఉన్న ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం దక్షిణ భారతదేశంలోని పురాతన శివాలయాల్లో ఒకటి.
- ఈ ఆలయం 11వ శతాబ్దానికి చెందినది మరియు కాకతీయ పాలకులచే నిర్మించబడింది. ఇది 108 స్తంభాలతో నిర్మించబడింది
- ఈ ఆలయాన్ని కాకతీయ రాజ్యానికి చెందిన మంత్రి అయ్యన్న దేవుడు నిర్మించాడు – అందుకే దీనికి ఐనవోలు అని పేరు వచ్చింది.
- పీఠాధిపతి శ్రీ మల్లికార్జున స్వామిని శివుని అవతారాలలో ఒకటిగా భావిస్తారు
గొల్లగట్టు జాతర
- ఈ జాతరనే పెద్దగట్టు జాతర, పాలశెర్లయ్య గట్టు జాతర, దురాజ్పల్లి జాతర అని పిలుస్తారు.
- సూర్యపేట జిల్లాలోని దురాజ్పల్లి గ్రామంలో పాలశెర్లయ్య గట్టు మీద ఈ జాతరను జరుపుకుంటారు.
- ఈ జాతరలో యాదవులు తమ ఆరాధ్యదైవం అయిన లింగమంతుల స్వామికి మొక్కులు చెల్లిస్తారు.
- ఈ జాతర సందర్భంగా 30 విగ్రహాలు ఉండే దేవరపెట్టెను కేసారం గ్రామానికి తీసుకొనివెళ్ళి హక్కుదారులకు చూపించి పూజలు చేస్తారు.
- ఈ జాతరలో ఖాసీంపేట యాదవకులం వారు పసిడి కుండను ఆలయగోపురంపై అలంకరిస్తారు.
- సూర్యపేట యాదవ కులస్తులు స్వామికి మకర తోరణాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్తారు.
- లింగమంతుల స్వామి తోబుట్టువు అయిన చౌడమ్మతల్లికి పూజలు చేసి నైవేధ్యం సమర్పిస్తారు.