Indian Economy Before Independence – Introduction : పరిచయం
భారతదేశాన్ని బ్రిటిషువారు దాదాపు రెండు శతాబ్దాల పాటు తిరుగులేని అధికారంతో పాలించారు. ఈ కాలంలో మన దేశ సంపదను కొల్లగొట్టి, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. బ్రిటిష్ పాలనలో భారతదేశ ముడి పదార్థాలను వారి దేశానికి ఎగుమతి చేస్తూ వారి పారిశ్రామిక వస్తువులను మన దేశంలోకి దిగుమతి చేసేవారు. దీంతో మన దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా నష్టపోయింది. రాజ్యాధికారం ఉండటం వల్ల బ్రిటిష్ వారు ఆర్థికపరమైన విధాన నిర్ణయాలన్నీ వారికి అనుకూలంగా తీసుకునేవారు. భారతదేశ ప్రగతి దృష్ట్యా గానీ, ప్రజా సంక్షేమం దృష్ట్యా గానీ తీసుకోలేదు. బ్రిటిష్ పాలనా కాలంలోని ఈ వలసవాద దోపిడీ మూడు దశల్లో కొనసాగింది. అవి:
1. వ్యాపార ముసుగులో దోపిడీ (mercantile capitalism) (1757 -1813)
బ్రిటిషువారు ఈ దశలో మన దేశంలోని ఆదాయాన్ని మన దేశంలో తయారైన వస్తువులను కొనడానికి ఉపయోగించి ఇంగ్లండుకు ఎగుమతి చేసేవారు. దీన్నే వ్యాపార ముసుగులో చేసిన దోపిడీ అని అంటారు. ఈస్ట్ ఇండియా కంపెనీలోని అవినీతి అధికారులు కూడా లంచాల ద్వారా సంపాదించిన ఆదాయాన్ని ఇంగ్లాండుకు చేరవేశారు.
భూమి శిస్తు రూపంలో రైతాంగం నుంచి వసూలు చేసిన ఆదాయాన్నే బ్రిటిషు వారు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎగుమతులకు ఉపయోగించారు.
2. పారిశ్రామిక దోపిడీ (Industrial Capitalism or Free-trade capitalism)(1813 – 1858)
ఈ దశలో భారతదేశం నుంచి ముడి సరుకులను ఎగుమతి చేస్తూ, భారతదేశానికి పారిశ్రామిక వస్తువుల దిగుమతి చేసుకుంటూ దేశాన్ని బ్రిటిష్ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చివేసారు. తమకున్న రాజ్యదికారంతో వారు ఇక్కడి నుంచి ముడి సరుకును కొనేదానికి ఇక్కడి ఆదాయాన్నే ఉపయోగించడమే కాక, చాలా తక్కువ ధరకు కొనుగోలు చేసేవారు. బ్రిటిష్ ప్రభుత్వం వారికి అనుకూలమైన రాబడి, వ్యయ విధానాలను అవలంభించింది.
3. విత్త దోపిడీ (Financial Imperialism) (1858 – 1947)
ఈ దశలో బ్రిటిషువారు తమ దగ్గర బ్యాంకుల్లో పొగైన ధనాన్ని భారత దేశంలో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలు ఆర్జించడానికి ప్రయత్నించారు. ఫలితంగా రైల్వేలు, రబ్బర్, గనులు, పేపర్, బ్యాంకింగ్ మొదలైన అనేక రంగాల్లో పెట్టుబడులు పెరిగి కొంతమేర దేశంలో మౌలిక వసతుల అభివృద్ధి జరిగింది. కానీ, బ్రిటిషువారి ముఖ్యోద్దేశం దేశాభివృద్ధి కాదు, తమ దగ్గర ఉన్న మిగులు ధనానికి సరైన పెట్టుబడి అవకాశాలు కల్పించి లాభాలు ఆర్జించడమే.
Read more : భారత ఆర్ధిక వ్యవస్థ : హరిత విప్లవం
Indian Economy Before Independence -National Income Estimates : జాతీయ ఆదాయ అంచనాలు
స్వాతంత్ర్యానికి పూర్వం మన దేశంలో జాతీయ ఆదాయానికి సంబంధించిన అధికారిక లెక్కలు లేనప్పటికీ దాదాభాయ్ నౌరోజీ తన గ్రంథం (పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా)లో 1867-68 సంవత్సర జాతీయ ఆదాయాన్ని రూ.340 కోట్లుగా అంచనా వేశారు. అప్పటి జనాభా సుమారు 17 కోట్లు ఉండటం వల్ల తలసరి ఆదాయాన్ని రూ.20గా పేర్కొన్నారు.
Indian Economy Before Independence – Poverty : పేదరికం
బ్రిటిష్ పాలనలో పేదరికానికి సంబంధించి మొదటి వంద ఏళ్లలో ఏవిధమైన గణాంకాలు లేవు. అయితే నాటి రచనలను, ఇతర డాక్యుమెంట్లను పరిశీలిస్తే బ్రిటిష్ పాలనకు ముందు ప్రజలు మెరుగైన జీవనాన్ని గడిపినట్లు తెలుస్తోంది. దాదాభాయ్ నౌరోజీ తన గ్రంథంలో మన దేశ పేదరికం గురించి కూడా ప్రస్తావించారు. భారతదేశం అనేక విధాలుగా సతమతమవుతూ పేదరికంలో మగ్గిపోతోందని పేర్కొన్నారు. 19వ శతాబ్దం చివర్లో భారత గ్రామీణ ప్రజల జీవనం అమెరికాలోని కట్టు బానిసల కన్నా హీనంగా ఉందని తెలిపారు. బానిసల బాగోగులను చూడటానికి వారి యజమానులైనా ఉన్నారు. కానీ వీరికి కనీసం ఆ దిక్కు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి ప్రభుత్వ స్టాటిస్టిక్ డెరెక్టర్ జనరల్ డూ హంటర్ తన రచన (England’s work in India)లో భారత్లో 40 మిలియన్ల మంది ఆహారలేమితో జీవిస్తున్నారని పేర్కొన్నారు.
Indian Economy Before Independence – Wages : వేతనాలు
ఒక దేశ ఆర్థికాభివృద్ధిని తెలుసుకోవడానికి ఆ దేశ ‘నిజ వేతనంలో పెరుగుదల ధోరణులు’ మేలైన సూచిక. కానీ బ్రిటిష్ కాలంలోని నిజ వేతనాలకు సంబంధించిన సరైన గణాంకాలు లభించట్లేదు. అయితే యునెటైడ్ ప్రావిన్సెస్ (ఉత్తరప్రదేశ్) నిజ వేతన సూచీ (1600వ సంవత్సరం నుంచి 1938 వరకు)ని డాక్టర్ రాధాకమల్ ముఖర్జీ రూపొందించారు. ఇతని ప్రకారం 1928లో నైపుణ్యం ఉన్న, నైపుణ్యం లేని శ్రామికుల నిజ వేతనం 1807లో ఉన్న నిజ వేతనంలో సగం (50 శాతం) మాత్రమేనని లెక్కించారు. దీన్ని బట్టి అప్పటి శ్రామికుల జీవన స్థితిగతులు ఎంత దయనీయంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
Indian Economy Before Independence – Occupational population classification : వృత్తుల వారీగా జనాభా వర్గీకరణ
మన దేశంలో జనాభా లెక్కలు 1881లో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి వృత్తుల వారీగా వర్గీకరణకు సంబంధించిన గణాంకాలు లభిస్తున్నాయి. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వారు 1881లో 61 శాతం ఉండగా 1921 నాటికి 73 శాతం పెరిగింది. వ్యవసాయ ఆధారిత ప్రజానీకం ఎక్కువ ఉండటం వెనకబాటుతనానికి సూచిక.
Indian Economy Before Independence – Traditional farming methods : సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు
బ్రిటిష్ పాలనలో వ్యవసాయ, సేద్య పద్ధతుల్లో ఎలాంటి నూతన పోకడలు చోటుచేసుకోలేదు. వ్యవసాయం సంప్రదాయ పద్ధతుల్లోనే కొనసాగింది. చాలా మంది రైతులు వ్యవసాయాన్ని వాణిజ్య దృష్టితో కాక జీవనోపాధిగానే కొనసాగించారు. భారత రైతాంగానికి అవసరమైన నీటిపారుదల సౌకర్యాలను కల్పించకుండా ఇంగ్లండ్ వారికి లాభదాయకంగా ఉండే రైల్వే మార్గాల నిర్మాణాలకు పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు.
Indian Economy Before Independence – Weak industrial appearance : బలహీన పారిశ్రామిక స్వరూపం
బ్రిటిష్ పాలనకు ముందు మన దేశం కళాత్మక చేతివృత్తులకు పెట్టింది పేరు. బ్రిటన్లో వచ్చిన పారిశ్రామిక విప్లవం వల్ల మన దేశంలోని చేనేత, కళాత్మక చేతివృత్తుల పనివారు ఉపాధి కోల్పోయి వ్యవసాయంపైనే ఆధారపడాల్సి వచ్చింది. అయితే అప్పట్లో కొన్ని పెద్ద పరిశ్రమల స్థాపన జరిగినప్పటికీ అవి శీఘ్ర పారిశ్రామికీకరణకు దోహదపడలేదు.
Indian Economy Before Independence – British Government Policies – Economic Backwardness : బ్రిటిష్ ప్రభుత్వ విధానాలు – ఆర్థిక వెనుకబాటుతనం
మన దేశం బ్రిటిష్ పాలన కాలంలో అభివృద్ధి చెందకపోవడానికి అధిక జనాభా, మత విశ్వాసాలు, సామాజిక స్వరూపం, మూలధన, సాంకేతిక పరిజ్ఞాన కొరత మొదలైనవి కారణాలని వలస సామ్రాజ్యవాదాన్ని సమర్థించే ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. దాదాబాయ్ నౌరోజీ, రమేశ్ దత్ మొదలైనవారు ఈ అభిప్రాయంతో ఏకీభవించక మన దేశ వెనుకబాటుతనానికి బ్రిటిష్ ప్రభుత్వం అవలంబించిన విధానాలే ప్రధాన కారణమని పేర్కొన్నారు.
1. భూస్వామ్య పద్ధతులు
1793లో కారన్ వాలీస్ ప్రవేశపెట్టిన జమీందారీ పద్ధతి.. రైతుల స్థితిగతులను అగాథంలోకి నెట్టేసింది. జమీందారులు ప్రభుత్వానికి చెల్లించే శిస్తు పరిమాణంలో మార్పు లేకపోయినప్పటికీ వారు రైతుల నుంచి ఎప్పటికప్పుడు అధికంగా వసూలు చేసేవారు. ఈ క్రమంలో రైతులను అనేక ఇబ్బందులకు గురిచేసేవారు. పైగా రైతాంగం బాగోగులను పట్టించుకోకుండా విలాసాల్లో మునిగి తేలేవారు. గ్రామీణ ప్రాంతాల్లో బలమైన పట్టున్న జమీందారీ వర్గం బ్రిటిష్ ప్రభుత్వ విధానాలకు వత్తాసు పలకటం వల్ల రైతాంగం గోడును పట్టించుకునేవారు కరువయ్యారు. ఫలితంగా వ్యవసాయ రంగం పురోభివృద్ధిలేక స్థబ్దతకు గురైంది.
2. పారిశ్రామిక, వాణిజ్య విధానాలు
బ్రిటిష్ ప్రభుత్వం భారత్లో అవలంబించిన పారిశ్రామిక, వాణిజ్య విధానాల ముఖ్యోద్దేశం మన దేశాన్ని ఇంగ్లండ్కు పూరక దేశంగా మార్చడం. ఈ దిశగా వారు తమ పారిశ్రామిక వస్తువులను అమ్ముకోవడానికి మన దేశాన్ని మార్కెట్ ఉపయోగించుకున్నారు. వారి పరిశ్రమలకు కావాల్సిన ముడి పదార్థాలను సరఫరా చేయడానికి వీలుగా మన దేశాన్ని వ్యవసాయంపై ఆధారపడే విధంగా చేశారు. భారత్ ఎగుమతులపై అనేక ఆంక్షలు విధించి మన దేశ పరిశ్రమలను కోలుకోని రీతిలో దెబ్బతీశారు.
3. ఆర్థిక దోపిడీ
దాదాబాయ్ నౌరోజీ అంచనా ప్రకారం 1835-1872 మధ్య కాలంలో మన దేశం. నుంచి 50 కోట్ల పౌండ్లు హోం చార్జీలు, కంపెనీ చెల్లించాల్సిన వడ్డీల రూపంలో ఇంగ్లండ్ కు తరలిపోయాయి. దీన్నే ఆయన ఆర్థిక దోపిడీ (Drain of Wealth or Drain Theory)గా పేర్కొన్నారు. అప్పట్లో మన దేశ ఎగుమతుల విలువ ఎక్కువగా, దిగుమతుల విలువ తక్కువగా ఉండటంతో విదేశీ మిగులు ఉండేది. ఆ మిగులును మన దేశాభివృద్ధికి బదులు ఇంగ్లండ్ అభివృద్ధికి ఉపయోగించారు.
4. హోం చార్జీలు
1829-1865 మధ్య కాలంలో 10 కోట్ల పౌండ్లు కేవలం హోం చార్జీలకే తరలించారు
హోం చార్జీల్లో ఉండే అంశాలు : ఈస్టిండియా కంపెనీ తన షేర్ హోల్డర్లకు చెల్లించాల్సిన డివిడెండ్లు, బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఇంగ్లండ్లో తీసుకున్న అప్పులకు చెల్లించాల్సిన వడ్డీలు, భారతదేశంలో ఉన్న ఇంగ్లండ్ మిలటరీకి అయ్యే ఖర్చు, బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో పనిచేసి రిటైర్డ అయిన ఉద్యోగుల పెన్షన్లు, బ్రిటిష్ ఇండియా అధికారులు సెలవుపై ఇంగ్లండు వెళ్లినప్పుడు వారి ప్రయాణాలకయ్యే ఖర్చులు ఉన్నాయి.
మన దేశంలో బ్రిటిష్వారు కొనసాగించిన యుద్ధాలకైన ఖర్చు భారతదేశాన్ని అనేక మంది స్వదేశీ, విదేశీ రాజులు చాలా ఏళ్లపాటు పాలించినప్పటికీ దేశ, ప్రజా శ్రేయస్సు పట్ల కొంత మొగ్గు చూపారు. అయితే ఇంగ్లండ్్వరి రెండు శతాబ్దాల పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ అన్ని విధాలుగా కుదేలైంది. “మనకు కావాల్సింది భారతదేశ సంపదను ఎట్లా తరలించుకుపోవాలన్నదే కానీ భారతదేశాన్ని ఎట్లా బాగుచేయాలన్నది కాదు” అన్న శాలిస్ ప్రభువు మాటలు బ్రిటిష్ పాలకుల మనస్తత్వానికి అద్దం పడుతున్నాయి.
Read more : భారతదేశంలో ఆర్థిక నియంత్రణలు
Indian Economy Before Independence : Conclusion
1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందటానికి ముందు బ్రిటిష్ పాలన రెండు శతాబ్దాల పాటు కొనసాగింది. బ్రిటిష్ ఆర్థిక విధానం యొక్క ఏకైక ఉద్దేశ్యం బ్రిటన్ యొక్క స్వంత ఆధునిక పారిశ్రామిక స్థావరాన్ని విస్తరించడానికి భారతదేశాన్ని ఫీడర్ ఎకానమీగా తగ్గించడం. స్వాతంత్ర్యానికి ముందు భారతదేశం వ్యవసాయం మరియు చేతివృత్తులపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. వస్త్రాలు మరియు విలువైన రాళ్ల రంగంలో పని చేసే నాణ్యత ఎక్కువగా ఉండటం వల్ల భారతీయ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త స్థావరం ఏర్పడింది. భారతదేశాన్ని ముడి సరుకుల ఎగుమతిదారుగా మరియు పూర్తి చేసిన వస్తువుల వినియోగదారుగా మార్చడం బ్రిటిష్ విధానం. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు అంతరాయం కలిగించింది.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |