Rivers in Telangana: Godavari and Krishna are the two main rivers that flow in Telangana. These two rivers flow from west to east. Telangana has prominent perennial rivers such as the Godavari in the north and the Krishna in the south. Many other rivers in Telangana impact the Telangana irrigation system. Rivers such as Bhima, Manair, Penganga, Akeru, Dindi, Manjeera, Paleru, and Pedda Vagu also irrigate the state. Here in this article, we are providing complete details of Rivers in Telangana. To know more about Rivers in Telangana read the article completely.
Adda247 APP
తెలంగాణలో నదులు
తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తున్న నదుల్లో గోదావరి, కృష్ణా, తుంగభద్ర, మంజీరా ముఖ్యమైనవి. ఈ రాష్ట్రంలో ప్రవహించే అన్ని నదులు వర్షాధారమైనవే. రాష్ట్ర భూభాగం వాయవ్యంలో ఎత్తుగా ఉండి, ఆగ్నేయ దిశగా వంగి ఉండటంతో రాష్ట్రంలో ప్రవహించే నదులన్నీ వాయవ్య దిశ నుంచి ఆగ్నేయ దిశకు ప్రవహిస్తున్నాయి. తెలంగాణలో గోదావరి, కృష్ణా నదులు పశ్చిమం నుండి తూర్పుకు ప్రవహిస్తాయి. తెలంగాణలో ఉత్తరాన గోదావరి మరియు దక్షిణాన కృష్ణా వంటి ప్రముఖ శాశ్వత నదులు ఉన్నాయి. భీమా, మానేర్, పెంగంగ, ఆకేరు, డిండి, మంజీర, పాలేరు మరియు పెద్ద వాగు వంటి ఇతర నదులు కూడా రాష్ట్రానికి సాగునీరు అందిస్తాయి.
తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే నదుల్లో ఎక్కువ శాతం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రల్లో పుట్టి తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోనికి ప్రవేశిస్తున్నాయి. కొన్ని నదులు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల్లో పుట్టి తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. వీటితోపాటు ఎన్నో ఇతర చిన్న నదులు, వాగులు, సరస్సులు ప్రజల అవసరాలను తీరుస్తున్నాయి. తెలంగాణలో ప్రవహిస్తున్న నదులు, వాటి ముఖ్య విశేషాలను తెలుసుకుందాం.
తెలంగాణలోని నదుల జాబితా
తెలంగాణ భారతదేశంలోని 29వ రాష్ట్రం మరియు 2 జూన్ 2014న ఉనికిలోకి వచ్చింది. రాష్ట్రాలు దక్షిణాన ఆంధ్ర ప్రదేశ్, తూర్పున ఛత్తీస్‌గఢ్ మరియు పశ్చిమాన మహారాష్ట్ర మరియు కర్ణాటకతో సరిహద్దులను పంచుకుంటున్నాయి. ఈ పట్టికలో తెలంగాణలోని నదుల జాబితాను తనిఖీ చేయండి
List of Rivers in Telangana | |||||
నది | పొడవు (కిమీ) | పొడవు (మైళ్లు) | పారుదల ప్రాంతం (కిమీ) | అవుట్‌ఫ్లో | తెలంగాణ జిల్లాలు |
గోదావరి నది | 1465 | 910 | 312812 | బంగాళాఖాతం | నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం |
కృష్ణా నది | 1400 | 870 | 258948 | బంగాళాఖాతం | నల్గొండ, ఖమ్మం |
భీమా నది | 861 | 535 | 70614 | కృష్ణా నది | మహబూబ్ నగర్ |
మంజీరా నది | 724 | 450 | 30844 | గోదావరి నది | నిజామాబాద్, మెదక్ |
మూసీ నది | 256 | 159 | NA | కృష్ణా నది | నల్గొండ, రంగారెడ్డి |
పాలేరు నది | 112 | 70 | NA | కృష్ణా నది | ఖమ్మం |
List Of Telangana Districts 2023
తెలంగాణలో నదులు – పూర్తి జాబితా
గోదావరి నది
దక్షిణ భారతంలోని నదులన్నింటిలో పెద్ద నదిగా గోదావరిని పేర్కొంటారు. దీన్ని దక్షిణగంగ, వృద్ధగంగ అని కూడా పిలుస్తారు. దీని పొడవు 1465 కి.మీ. ఈ నది జన్మస్థలం మహారాష్ట్రలో ఉన్న పశ్చిమ కనుమల్లోని త్రయంబకం. ఇది నాసిక్ మీదుగా మహారాష్ట్రలో ఎక్కువ భాగం ప్రవహించి, ఆదిలాబాద్ జిల్లాలోని బాసర వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది.
- మంజీర, ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, సీలేరు గోదావరి ముఖ్య ఉపనదులు.
- గోదావరి నది ఆదిలాబాద్ జిల్లా పడమటి సరిహద్దు వద్ద మంజీరా నదిని కలుపుకుని ఆదిలాబాద్ – నిజామాబాద్, ఆదిలాబాద్ – కరీంనగర్ జిల్లాలకు సరిహద్దుగా ప్రవహిస్తోంది.
ఆదిలాబాద్ తూర్పు సరిహద్దుగా ప్రవహిస్తూ వచ్చే ప్రాణహిత నది ఆదిలాబాద్ – కరీంనగర్ జిల్లా సరిహద్దులో గోదావరిలో కలుస్తుంది. గోదావరి నది కరీంనగర్ జిల్లా తూర్పు సరిహద్దు వెంబడి కొంతదూరం ప్రవహించి, ఇంద్రావతి నదిని కలుపుకుని, వరంగల్, ఖమ్మం జిల్లాల మీదుగా, పాపికొండలు దాటి ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం వద్ద మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది.
గోదావరి ఉప నదులు:
గోదావరి నదికి ఉన్న ముఖ్య ఉపనదుల్లో కొన్నింటిని కింది విధంగా వర్గీకరించ వచ్చు.
- కుడి ఉపనది: మంజీరా
- ఎడమ ఉపనదులు: పెన్‌గంగ, వార్థా, వెయిన్‌గంగ, ప్రాణహిత (వెయిన్‌గంగ, వార్థాల కలయికతో ఏర్పడిన నది), ఇంద్రావతి, శబరి, సీలేరు.
గోదావరి నది పాపికొండల వద్ద పెద్ద లోయ (Gorge) ను ఏర్పరుస్తుంది. దీని పేరు బైసన్ గార్జ్ (Bison Gorge). ఇది బంగాళాఖాతంలో కలిసే ముందు 1) గౌతమి, 2) వశిష్ట, 3) వైనతేయ, 4) తుల్య, 5) భరద్వాజ, 6) కౌశిక, 7) ఆత్రేయ అనే ఏడు పాయలుగా చీలిపోయి, డెల్టాలను ఏర్పరుస్తుంది.
మంజీర
మంజీర నది మహారాష్ట్రలోని బాలాఘాట్ పర్వతాల్లో జన్మించి, ఆగ్నేయ దిశగా ప్రవహిస్తుంది. ఇది మెదక్ జిల్లాలో నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ నుంచి నిజామాబాద్ జిల్లాలో కొంతదూరం ప్రవహించి, గోదావరి నదిలో కలుస్తుంది. ఈ నదిపై నిజామాబాద్‌లో నిజాంసాగర్ ప్రాజెక్టును నిర్మించారు. దీని మొత్తం పొడవు 724 కి.మీ.
ప్రాణహిత
వార్థ, వెయిన్‌గంగ అనే రెండు చిన్న నదుల కలయిక వల్ల ఏర్పడిన నదే ప్రాణహిత. ఈ నదులు మధ్యప్రదేశ్‌లోని సాత్పూరా పర్వతశ్రేణుల్లో పుట్టి, దిగువకు ప్రవహిస్తున్నాయి. ఈ నది ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు పొడవునా ప్రవహించి ‘చెన్నూర్ వద్ద గోదావరిలో కలుస్తుంది.
Telangana Government Schemes (తెలంగాణ ప్రభుత్వ పధకాలు)
కృష్ణా నది
కృష్ణా నది జన్మస్థానం మహారాష్ట్రలో ఉన్న పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వర్. ఇది మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో తూర్పుదిశగా ప్రవహించి, మహబూబ్‌నగర్ జిల్లా మక్తాల్‌లోని తంగడి గ్రామం వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది.
ఈ నది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సహజ సరిహద్దుగా ఉంది. తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలకు సరిహద్దుగా ప్రవహిస్తోంది. కృష్ణా జిల్లాలోని హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణా నది మొత్తం పొడవు 1400 కి.మీ.
కృష్ణా నదికి 1) తుంగభద్ర, 2) డిండి, 3) పాలేరు, 4) కొయనా, 5) భీమ, 6) ఘటప్రభ, 7) మూసీ,
8) మున్నేరు, 9) మలప్రభ నదులు ముఖ్య ఉపనదులు. ఉపనదులన్నింటిలో భీమ నది అతిపొడవైంది.
తుంగభద్ర
తుంగభద్ర నది కృష్ణా నదికి అతి ముఖ్యమైన ఉపనది. పశ్చిమ కనుమల్లో దక్షిణ కెనరా, మైసూరు జిల్లా సరిహద్దులో ఉన్న గంగమూల – వరాహ పర్వతాల్లో జన్మించిన తుంగ, భద్ర నదుల కలయికే తుంగభద్ర.
తుంగభద్ర ముఖ్య ఉపనది ‘హగరి’. ఈ నదిపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఉమ్మడిగా తుంగభద్ర ప్రాజెక్టును కర్ణాటకలోని హోస్పేట వద్ద నిర్మించారు. ఈ నది పొడవు సుమారు 530 కి.మీ.
మూసీ నది
ఇది కృష్ణా నదికి ఉపనది. రంగారెడ్డి జిల్లాలోని అనంతగిరి కొండలు దీని జన్మస్థానం. హైదరాబాద్ నగరం మీదుగా ప్రవహించి నల్గొండ జిల్లాలోని వజీరాబాద్ (వాడపల్లి) వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.
రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమైన నదిగా మూసీ నదిని పేర్కొంటారు. ‘ఆలేరు’ దీని ముఖ్య ఉపనది. ఈ ఆలేరు నది చిత్తలూరు వద్ద మూసీలో కలుస్తుంది. హైదరాబాద్‌లో మూసీ నదిపై ఆనకట్ట కట్టినందువల్ల ఉస్మాన్‌సాగర్ – గండిపేట ఏర్పడింది. మూసీ నది పొడవు సుమారు 250 కి.మీ.
డిండి నది
మహబూబ్‌నగర్ జిల్లాలోని షాబాద్ కొండల్లో జన్మించిన డిండి నది అమ్రాబాద్, నందికొండ గ్రామాల మీదుగా ప్రవహిస్తుంది. ఏలేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దీని పొడవు సుమారు 153 కి.మీ. ఈ నదికి ఉన్న మరో పేరు మీనాంబరం.
పాలేరు నది
పాలేరు నది వరంగల్ జిల్లాలో పుట్టి నల్గొండ, ఖమ్మం జిల్లాల మధ్య ప్రవహిస్తుంది. ఇది జగ్గయ్యపేట వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దీని పొడవు సుమారు 145 కి.మీ.
మున్నేరు నది
ఈ నది జన్మస్థానం వరంగల్ జిల్లా. ఇది ఖమ్మం జిల్లాలో ప్రవహించి, దక్షిణంగా కృష్ణా నదిలో కలుస్తుంది. మున్నేరు నది పొడవు సుమారు 198 కి.మీ.
👉 Download List Of Rivers in Telangana PDF👈
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |