The government has declared Poleramma Jatara as the state festival of AP | పోలేరమ్మ జాతరను ఏపీ రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది
వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ అమ్మవారి జాతరను ఏపీ రాష్ట్ర పండుగగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ గుర్తింపునకు అనుగుణంగా జీవో నం.390తో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 11న స్థానిక పోలేరమ్మ ఆలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు, వెంకటగిరి సమన్వయకర్త నేదరుమల్లి రాంకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 21న వెంకటగిరి పర్యటనలో సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టు కున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నక్కా భానుప్రియ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దొంతు శారద, కళ్యాణి, వహీదా, మాడ జానకిరామయ్య, చెలికం శంకర్ రెడ్డి, పులి ప్రసాద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
జాతర గురించి:
అనాదిగా సంప్రదాయాలను కాపాడే వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతరకు విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. 1714లో ఇక్కడ జాతర జరిగినట్లు చారిత్రక ఆధారాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. 1913 నుంచి ఈ జాతర వైభవం ఏటేటా పెరుగుతూ వస్తోంది. ఆది నుంచి వెంకటగిరి రాజాల ఆధ్వర్యంలో జాతర జరిగేది, భక్తులు లక్షలాదిగా పోటెత్తుతుండటంతో రెండు దశాబ్దాల కిత్రమే దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుని నిర్వహిస్తోంది. గత రెండు దశాబ్దాలుగా వేలాది మంది భక్తులను ఆకర్షిస్తున్న ఆలయం విశేషమేమిటంటే, సంప్రదాయం ప్రకారం నేటికీ జాతర చాటింపు జరిగేది రాజాల అనుమతి తీసుకున్న తర్వాతే.
ప్రతి సంవత్సరం, వినాయక చవితి తరువాత, జాతర మొదటి బుధవారం అర్ధరాత్రి ప్రారంభమవుతుంది, మూడవ బుధవారం మరియు గురువారం వరకు కొనసాగుతుంది. అప్పటి నుంచి అందరూ జాతర పనుల్లో నిమగ్నమవుతారు. పూర్తయ్యేవరకూ గ్రామంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు.
మరింత చదవండి |
|
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |